
Nishidhar Reddy
ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..ప్రజా సంపదను అడ్డగోలుగా దోపిడీ చేస్తుందని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజ వనరులను నిలువుగా దోపిడి చేస్తూ..లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నేడు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు ఇసుక మాఫియాను పెంచి పోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చేసిన ఇసుక దందా వల్ల టేకుమట్ల మండలంలోని మానేరు వాగులో ఇసుక దిబ్బలు లేకుండా పోవడంతో భూగర్భ జలాలు అడుగంటుకు పోయాయని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయన అనుచరులు సైతం ఇసుక దందా చేయడం వల్ల ఇసుక దిబ్బలు పూర్తిగా లేకుండా పోతున్నాయని, దీంతో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటుకుపోయి రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచిన గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..వారి అనుచరులు ఇసుక మాఫియాపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏమిటని నిషిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఆరి తేరిన ఈ దొంగల ముఠా చీకటి కోణంలో ఇసుకను అక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. జెసిబిల సహాయంతో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తోడేళ్ల లాగా తోడుస్తూ..ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి..రాత్రిపూట పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో, దేవాలయాల నిర్మాణాల పేరుతో, అభివృద్ధి పనుల పేరుతో అధికారుల వద్ద అనుమతి పత్రాలు తీసుకొని అక్రమ ఇసుక దందాకు తెరలేపిన ఘనుడు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇదే తరహాలో ఇసుక దందాకు తెర లేపితే..ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక దందాను ఆపకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
త్వరలో జరగబోయే స్థానిక స్థానిక సమరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా శ్రమించి..బార్డర్ లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వలె కష్టపడి పనిచేసి టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ..నేడు ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ..స్థానిక సమరంలో గెలవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక సమరంలో ఎండగట్టాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడు మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బిజెపి సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి భూత అధ్యక్షులు అశోకు రామ్మోహన్ రావు మండల నాయకుడు దొమ్మటి రవీందర్ దేశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు