కృత్రిమ మీడియాలో కాంగ్రెస్‌…ప్రజా క్షేత్రంలో బిఆర్‌ఎస్‌.

https://epaper.netidhatri.com/

` కాంగ్రెస్‌ లో కుంపట్లు…

`టిక్కెట్ల సిగపట్లు.

` సీనియర్లలో కొరవడిన ఐక్యత.

` ఎటూ తేల్చుకోలే గందరగోళాలాలు.

`నేనే సిఎం అంటూ సీనియర్ల ప్రకటనలు.

`నేనే నాయకుడిని.. కొండంగల్‌ లో రేవంత్‌ రెడ్డి..

`నేనే సిఎం…కోమటి రెడ్డి వెంకటరెడ్డి.

`ఆలూ లేదు..చూలు లేదు..ఆతృతకు అంతులేదు.

`అటు కొట్లాటలు…ఇటు పదవుల పంపకాలు.

`ఎన్నికలయ్యేదాకా ఇదే కొట్లాట..

`కాంగ్రెస్‌ అంటేనే గ్రూపుల గలాట.

`జనం సమస్యలు పట్టవు.

`ప్రజలకు చేరువ కాలేరు.

`జనం కాంగ్రెస్‌ ను రానివ్వరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా కాంగ్రెస్‌ అంటేనే కోపాలు, తాపాలు, కొట్లాటలు, కుంపట్లు,సిగపట్లు, గందరగోళాలు, ఇలా చెప్పుకుంటూపోతే సకల దరిద్రాలకు నిలయం. ఏ ఒక్కరి మాట మీద అందరూ వుండరు. ఎవరికి వారే..యమునా తీరే..అక్కడ ఎవరు పవర్‌ఫుల్లో, ఎవరి పవర్‌ లెస్సే ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు కీలకభూమికపోషిస్తారో ఎవరికీ అర్దం కాదు. అంతా గందరగోళం జగన్నాధం..ఎప్పుడు ఎవరు పెత్తనం చేస్తారో కూడా చెప్పడం కష్టం. ప్రతిసారి ఒకరి పెత్తనం సాగుతుంది. కాని ఈసారి జరుగుతున్నంత గందరగోళం ఎప్పుడూ లేదు. పైగా నేనే సిఎం…నేనేంటే నేనే అన్న వారు మళ్లీ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఆ మధ్య జానారెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నేనే సిఎం అన్నారు. నాకంటే సీనియర్‌ ఎవరూ లేరు. నాకంటే అర్హత కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. పదవులు నాకు అలంకారం కాదు. నేనే పదువులకు అలంకారం అని కూడా చెప్పుకున్న ఏకైక నాయకుడు జానారెడ్డి. జానారెడ్డి నేనే సిఎం అంటు గత పన్నెండేళ్లుగా చెబుతున్నాడు. 2009 తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత ఆయనకు కూడా ఆశ కల్గింది. అప్పటి నుంచి నేనే సిఎం అంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో నేనే సిఎం అన్నాడు. 2018లో కూడా అదే చెప్పాడు. కాని ఓడిపోయాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. కాని నేనే సిఎం అంటున్నాడు. తాజాగా రేవంత్‌ రెడ్డి మీ కొడంగల్‌ బిడ్డనే రాష్ట్రానికి నాయకుడు అన్నాడు. అంతే షర్మిల మీడియా ముందుకు వచ్చి, తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లు కొట్టిచెప్పింది. ఇక నేను కూడా ఎక్కడ రేస్‌లో వెనుకబడి పోతానో అనుకున్నాడో ఏమో! కోమటి రెడ్డి వెంటకరెడ్డి కూడా నేను సిఎం అవుతానన్నాడు. అంతే నా కంటే మీరే నేను సిఎం కావాలని కోరుకుంటున్నారంటే ప్రజలనుద్దేశించి అన్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి కూడా నేనే సిఎం అన్న మాట చెప్పేశాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్ధితులను ఆసరా చేసుకొని, మొత్తానికి రేవంత్‌రెడ్డి చక్రం తిప్పుతున్నారు. కాని కావాలనే అసంతృప్తి జ్వాలలు రలిగిస్తున్నారు. అసలైన కాంగ్రెస్‌ నేతలు పక్కన పెట్టి, తన సొంత అనుచరగాణానికి ప్రాధాన్యత కల్పిస్తున్నాడు.
గతంలో ఎన్నడూ కాంగ్రెస్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారంటూ వార్తలు రాలేదు.
కాకపోతే తమకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే టిక్కెట్లు ఇప్పించున్నారన్న వార్తలు వుండేది. ఎవరి గ్రూపు వారు పదిలం చేసుకునే రాజకీయాలు వుండేవి. కాని రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ రాజకీయాలే మారిపోయాయి. మొత్తంగా తెలుగుదేశం ఫ్రేమ్‌ మాత్రమే కనిపిస్తోంది. ఆ ఫేమ్‌ కోసమే రేవంత్‌ రాజకీయం చేస్తున్నట్లుంది. అందుకే కాంగ్రెస్‌ మొత్తం ఖాళీ చేసే ఎత్తుగడలు వేశాడు. పక్కాగా ప్రణాళికలు అమలు చేశాడు. మొత్తం సైకిల్‌ నేతలను నింపడంతోపాటు, రెడ్డి నేతలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇవి ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు. ఎవరికి నష్టమన్నది మాత్రం తేలిపోతోంది. ఎన్నటికైనా రేవంత్‌ రాజకీయం వల్ల సీనియర్లకు అవమానాలు తప్పవు. వారి ఆశలు అడియాసలు కావడం తప్పదు. ఈసారి ఎలాగూ కాంగ్రెస్‌ అదికారంలోకి రాదన్న సంగతి రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. పాతకుపోయిన సీనియర్లందరినీ పక్కన పెడితేగాని కాంగ్రెస్‌ మొత్తం తన చేతుల్లోకి రాదన్నది రేవంత్‌కు సష్టంగా అర్ధమైన విషయం. అందుకే ఓ దశలో కాంగ్రెస్‌ అంటేనే నేను..నేనంటేనే కాంగ్రెస్‌ అని అమెరికాలో అన్నారు. దాంతో కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఆయన ప్రకటనను తప్పుపట్టారు. అయితే అంతకు ముందే తాను ఐపిఎస్‌ ఆఫీసర్‌ లాంటి వాడిని అని అనడంతో సీనియర్లంతా భగ్గుమన్నారు. మేం హోంగార్డులమా? అంటూ ఫైర్‌ అయ్యారు. అయినా రేవంత్‌రెడ్డిని కదిలించలేకపోయారు. దాంతో ఆత్మాభిమానం వున్న నాయకులు కాంగ్రెస్‌ను వదిలి పెట్టి వెళ్లిపోయారు.
రాజకీయ అవకాశవాదంతో మళ్లీ వాళ్లే కాంగ్రెస్‌లోకి వస్తుండడంతో రేవంత్‌ తన రాజకీయానికి మరింత పదునుపెడుతున్నట్లు కనిపిస్తున్నా కాంగ్రెస్‌ను పూర్తిగా తెలుగుదేశంగా మార్చే ప్రయత్నంలో సక్సెస్‌ అవుతున్నారు.
కేవలం రెడ్డి వర్గమైతేనే తన చెప్పు చేతుల్లో వుంటుందని, తన రాజకీయాలు సాగుతాయని రేవంత్‌ అంచనా వేసుకుంటున్నారు. దాంతో ఇతర సామాజిక వర్గ నేతలను పక్కన పెడుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వారిని ఇప్పటికే సాగనంపేశారు. ఇప్పుడు మరో బలమైన నేత దామోదర రాజనర్సింహను కూడా సాగనంపేపనిలో వున్నారు. రేవంత్‌రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసలు రేవంత్‌ను ఓ దశలో చెడుగుడు ఆడుకున్నారు. తానే పులిని అనుకున్నాడు. చివరికి రేవంత్‌కు సరెండరైపోయాడు. ఇదే ప్రజల్లో లేని కాంగ్రెస్‌ పార్టీని ఆంద్రా మీడియా, ఆ పార్టీ సృష్టించుకున్న సోషల్‌ మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆ ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందా అంటే వెళ్లదు. కేవలం యూత్‌కు ఎంటర్‌టైన్‌మెంటుగా మాత్రమే పనికొస్తుంది. ఇలా ఓవైపు కాంగ్రెస్‌లో ఓ వర్గం హడావుడి చేస్తుంటే సీనియర్లు తెలంగాణ మొత్తం కాంగ్రెస్‌లో ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ మొత్తం ఓ కొద్ది మంది చేతుల్లో మాత్రమే బందీ అయిపోయింది. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తోంది. ఈ విషయాన్ని గతంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుల సమీకరణాల సమావేశంలో వచ్చేది మన రాజ్యమే అంటూ వారికి లేని పోని ఆశలు కల్పించాడు. మొత్తానికి తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటున్నప్పటికీ సీనియర్లను పక్కనపెట్టి పెద్ద తప్పు చేస్తున్నాడు.
తెలంగాణ మొత్తం సీనియర్లంతా కాంగ్రెస్‌ను వీడిపోతున్నారు.
గడచిన ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తూ, ప్రచారాన్ని మాత్రం రేవంత్‌రెడ్డి ఉదృతం చేసుకుంటున్నాడు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం మూలంగా వాళ్లు కొంతదూకుడుగా ప్రచారం సాగిస్తారన్ననమ్మకంతో రేవంత్‌వేసిన స్కెచ్‌ సక్సెస్‌ అవుతుందన్న పగటి కలల్లో వున్నాడు. నిజానికి గ్రౌండ్‌లో పరిస్ధితి వేరు. కాంగ్రెస్‌ సృష్టించిన మీడియాలో పరిస్ధితి వేరు. తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకొని వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఈ విషయం తెలంగాణ ప్రజలే చెబుతున్నారు. అసలు దేశంలోనే అత్యంత వేగవంతమైన ప్రగతిని సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అసలు తెలంగాణలో ప్రజల్లో ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదని రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. అందుకే టిక్కెట్ల పంపకాలను, అమ్మకాలుగా మార్చుకున్నాడన్నది ఓ ఆరోపణ. కాంగ్రెస్‌ పార్టీ కోసం రేవంత్‌రెడ్డి గతంలో ఏ నాయకుడు పెట్టనంత ఖర్చు చేశాడు. కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ అధికారంలోకి రాదని ఆయనకు తెలుసు. అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబడి కావాలంటే టిక్కెట్లు అమ్ముకోవడమే శరణ్యమనుకున్నాడు. టిక్కెట్ల బేరం పెట్టేశాడు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. వాళ్లు ముట్టజెప్పిందెంతో కూడా లెక్కలు చెబుతున్నారు. గత రెండు మూడేళ్లుగా రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మికోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ రేవంత్‌ మొండి చేయి చూపించాడు. వాళ్లకు టికెట్‌ ఇస్తాం..ఎంతిస్తావంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే వాళ్లను లూప్‌లైన్లో పెట్టి, కొత్తవారికి మూటలు అప్పగించిన వారికి టిక్కెట్లు ఇచ్చాడు. వారిని గెలిపించుకొచ్చే పూచీ నాదని అధిష్టానాన్ని నమ్మించి, సీనియర్లను పక్కన పెట్టి, అసలైన కాంగ్రెస్‌ నాయకులను వంచించి, తన లెక్కలు తాను రచించుకొని ఓడిపోయే పార్టీ నుంచి సొమ్మును కూడబెట్టుకునే ఎత్తుగడ వేశాడు. వచ్చే ఎన్నికల ఆశలను ఇప్పటినుంచే పదిలం చేసుకునే ఆలోచన చేస్తున్నాడు. అందుకే ప్రచారంలో కనిపిస్తే చాలు..అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *