
Congress
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ
యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి
అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం.
నర్సంపేట,నేటిధాత్రి:
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు.
రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.