రైతులకు నీళ్లిస్తమని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌

మార్పు అంటే పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా

మూడు నెలల్లో 138మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు

ఎండిన పంటలకు నష్టపరిహరం చెల్లించి ఆదుకోవాలే

బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో కరెంటు..సాగునీటి కష్టాల్లేవు

మాజీ మంత్రి..ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌ సర్కార్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం ముత్తారం మండలం సీతంపల్లి, రామకృష్టాపూర్‌ గ్రామాల్లో ఎండిన పంటలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి నాడు నేటి పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యాసంగిపంటకు సాగునీరు ఇవ్వలేమని ముందుగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం, పాలకులు ప్రకటిస్తే రైతులు పంటలు సాగు చేసి నష్టపోయే వారు కాదన్నారు. సాగునీరు అందిస్తామని చెప్పడంతో రైతులు పంటలు సాగు చేసుకున్నారని, ఈనాడు సాగునీరు ఇవ్వమంటే ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఆనాడు రైతుల కష్టాలను ఆలోచించి కాల్వలు తవ్వించి ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గత ఏడాది యాసంగి సమయంలో ప్రతి బోరు, ప్రతి చెరువు నిండుగానే ఉన్నాయని, రైతులకు పుష్కలమైన నీరు అందించామని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని గొప్పలు చెప్పారని, మార్పు అంటే పచ్చగా ఉండే పంట పొలాలను ఎండబెట్టడమేనా అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన మూడు మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 138మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని, రైతుల ఆత్మహత్యల కోసమేనా తెలంగాణ సాధించుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. సాగునీరు లేక ఎండి పొలాలకు ప్రభుత్వం నష్టపరిహరం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అధైర్యపడవద్దు…అండగా ఉంటాం…పుట్ట మధూకర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌

ముత్తారం :- నేటి ధాత్రి

కరెంటు, సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతులు ఆధైర్యపడవద్దని అండగా ఉంటామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు. ముత్తారం మండలం సీతంపల్లి, రామకృష్టాపూర్‌ గ్రామాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ఎండిన పంటలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మార్పు అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. పదేళ్ల క్రితం సమైఖ్యాంధ్ర పరిపాలనతో ఎలా ఉండేదో అవే పరిస్థితులు మళ్లీ కన్పిస్తున్నాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నాయకులు ఇన్ని కష్టాలు పెట్టకపోయినా స్వరాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రం మా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి మమ్మల్ని రోడ్లపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం హోలీ సంబరాల్లో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. రైతులు ఎన్ని కష్టాలు పడ్డా ఈ ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. పంటలు ఎండిపోయి కష్టాల్లో ఉన్న రైతులను కలిసి ధైర్యం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాము ఎండిన పంటలను పరిశీలించి ధైర్యం చెబుతున్నామని అన్నారు. ఆయా గ్రామాల్లోని బీఆర్‌ఎస్‌ నాయకులు , రైతు నాయకులు ఎండిన పంటను అంచనా వేసి తమకు అందజేయాలని, బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ మెడలు వచ్చి రైతులకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేస్తామన్నారు. నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు గుజ్జుల రాజి రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు అల్లం తిరుపతి సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు నూనే కుమార్ పటేల్ ఓదెలు జక్కుల ఓదెలు జక్కుల సది రావుల శేఖర్ బి ఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *