
`మనమిద్దరమే వుందాం!
`జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరి!
`కాంగ్రెస్, బిజేపిలు అనుసరిస్తున్న విధానం!
`మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం.
`సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి.
`మూడో పార్టీ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి.
`రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించాలి.
`అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి.
`మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి.
`జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి.
`ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు!
`బీఆర్ఎస్ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు!
`తృణమూల్‌ను బెంగాల్ దాటకుండా చూసుకుంటున్నార్.
`జేడియూను పొత్తులో బీహార్ దాటకుండా చేశారు.
`తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు.
`టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనగానే అదును చూసి ఒత్తేశారు.
`కేసీఆర్ ను కోలుకోకుండా చేశారు.
`ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు.
`కాంగ్రెస్ ను కాదని ఆప్ ఆగమైంది.
`ఎవరినీ నమ్మక బిఆర్ఎస్ ఎటుగాకుండా వుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలలో ఆధిపత్యం కనిపించినా అంతర్గతంగా వుండే అవగాహనలు చాలా వుంటాయి. వాటి ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతుంటాయి. పైకి మాత్రమే బద్ద శతృత్వం కనిపిస్తుంది. స్నేహ హస్తాలు పైకి బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. పార్టీల మధ్య ఒప్పందాలు లోతుగా అర్థం చేసుకుంటే తప్ప కనిపించవు. కాకపోతే తాము ఎల్లకాలం అధికారంలో వుండాలన్న లక్ష్యంతో పని చేస్తుంటాయి. గెలుపోటములు ప్రజల నిర్ణయానికి వదిలేస్తుంటాయి. నిజం చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేసే ప్రచారం మీద ప్రజలు ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక అపోహ మాత్రమే. ఏ తరం ఆలోచనలు ఎలా వుంటాయన్నది ఏ రాజకీయ పార్టీ అంచనా వేయలేదు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కొట్టుకుపోక తప్పదు. గెలిచామనే సంబరం రాజకీయ పార్టీలకు ఆ క్షణమే వుంటుంది. గెలిచినా ఐదేళ్లలో ప్రజా ఉద్యమాలు రావొచ్చు. ఉపద్రవాలు దరి చేరొచ్చు. రాజకీయ పార్టీలలో చీలికలు రావొచ్చు. నాయకులు విడిపోవచ్చు. సొంత పార్టీలలోనే ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోవచ్చు. ఇందుకు బిజేపి మినహాయింపు కాకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో పాలించే రాజకీయ పార్టీలలో ఎల్ల కాలం ఒక్కరే పరిపాలిండాన్ని సొంత నాయకులు కూడా అంగీకరించరు. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా పనిన నరేంద్ర మోడీని నాలుగో సారి కూడా సొంత పార్టీ అంగీకరించే పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే బిజేపిలో కూడా ఎంతో సమర్థవంతమైన నాయకులున్నారు. వాళ్లలో క. మోడీ తప్ప మరో నాయకుడు లేడనే భావన బలపడితే బిజేపికి భవిష్యత్తులో తీరని నష్టం ఎదురుకావొచ్చు. పైగా ఎప్పుడూ మోడీనే అంటే పార్టీలో తిరుగుబాటు మొదలుకావొచ్చు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ 75 సంవత్సరాల వయసు అంశాన్ని పదే పదే తెరమీదకు తెస్తోంది. రాజకీయాలలో ఎప్పుడూ ఏదో ఒకటి జరగొచ్చు. ఎప్పటికీ ఒకే రకమైన రాజకీయం సాగకపోవచ్చు. వ్యక్తి స్వామ్యరాజకీయానికి బిజేపిలో చోటు లేదు. అయినా ప్రధాని మోడీకి ఇప్పటి వరకు ఎదురులేదు. భవిష్యత్తులో కూడా వుంటుందని అనుకోలేం..తర్వాత రోజులలో ప్రజలు మార్పు కోరుకోలేరని చెప్పలేం..అందుకే జాతీయ రాజకీయాలలో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జాతీయ స్థాయిలో మూడో రాజకీయ వ్యవస్థ చేరకుండా, రానివ్వకుండా అయితే మీరు, లేకుంటే మేము! అనే అంతర్లీన ఒప్పందానికి కాంగ్రెస్, బిజేపిలు వచ్చాయా? అంటే అవుననే విషయాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషక మేధావి వర్గాలలో చర్చలకు దారి తీస్తున్నాయి. దేశంలో ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చక్రం తిప్పుతూ వుండేవి. ఇప్పుడు ఆ పార్టీలు మనుగడ కోసం ఆరాటపడుతున్నాయి. పోరాటం చేసే శక్తి చాలని వ్యవస్థలుగా మిగిలిపోయాయి. అయితే జాతీయ స్థాయిలో ఎదగాలని, దేశ వ్యాప్తంగా రాజకీయంగా బలపడాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆప్, తృణమూల్ వున్నాయి. బిఆర్ఎస్ ఆ పని చేయాలనుకొని ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చతికిలపడిపోయింది. ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేసే స్థితిలో వుంది. ఒకప్పుడు బిఎస్పీ పార్టీ జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం అవుతుందని అంచనా వేశారు. కానీ బిఆర్ఎస్ లాగానే సొంత రాష్ట్రంలో ఓడిపోయింది. ఇప్పుడు కనుమరుగయ్యే తరుణానికి, పుంజుకోవాలన్న ఆరాటానికి మధ్య ఊగిసలాడుతోంది. సమాజ్ వాదీ ఉత్తర భారతంలోనే విస్తరించాలని చూసినా కుదరలేదు. కాకపోతే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బలంగానే వుంది. ప్రజలు బిజేపిని కాదనుకుంటే గెలిచే పార్టీగా ఉత్తర ప్రదేశ్ లో క్యూలో వుంది. ఇలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న పార్టీలు ప్రాంతీయ భావనలతో బతుకులీడుస్తున్నాయి. కానీ ఇంతలో ఆప్ వచ్చేసి ఎక్కడ బిజేపి, కాంగ్రెస్ లను చీపురుతో ఊడ్చేస్తుందో అనే భయం పట్టుకుంది. అందుకే ఇక ఎట్టిపరిస్థితులలోనూ మనమిద్దరమే వుందాం! అన్న ఆలోచనలలో రెండు పార్టీలున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరిలో ఇలాంటి అవగాహన అనేది ఏర్పడినా, పెరిగినా ప్రాంతీయ పార్టీలకు ఉరే మిగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఈ రెండు పార్టీల కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీ వైపు నిలిస్తే తప్ప పార్టీలు భవిష్యత్తులో బతికే ఛాన్స్ లేదు. ఈ రెండు కూటములలో కాకుండా మూడో వ్యవస్థ ఏది ఏర్పడకుండా కట్టుదిట్టమైన రాజకీయంతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అంతే కాకుండా మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం అనే ఆలోచనలు రెండు పార్టీలు చేస్తున్నాయి. రాజకీయంగా పరిణామాలైనా సరే సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే అవకాశం వుంది. అది మూడో ఫ్రంట్ రూపంలో ఉపద్రవం ముంచుకురావొచ్చు. ఎన్నికల సమయాలలో ఏదైనా జరగొచ్చు. ఏది జరిగినా రెండు జాతీయ పార్టీలకు నష్టదాయకమే అవుతుంది. మూడో పార్టీగాని, మూడో ఫ్రంట్ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి. ముఖ్యంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు కాకుండా, ప్రాంతీయ పార్టీలను తమ అదుపాజ్ఞలో వుంచుకోవాలి. సహజంగా రాష్ట్రాల ఎన్నికలు అనగానే ప్రాంతీయ పార్టీలు వున్న చోట ఆ పార్టీల వైపే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. స్థానిక సమస్యల మీద వాళ్లకు అవగాహన తో పాటు కమిట్ మెంట్ వుంటుంది. దానికి తోడు ఏదో ఒక సెంటిమెంట్ కూడా వుంటుంది. వాటి నుంచి ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడరు. అలా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇలాంటిది ఏదో సెంటిమెంట్ వుంటుంది. మహారాష్ట్ర లో మరాఠ, తమిళనాడులో పెరియార్, ఆంద్రప్రదేశ్ లో తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలంగాణ లో ప్రాంత అస్థిత్వ సెంటిమెంట్ బలమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాజకీయాలు చేయడం ఎంతో అవసరమని గుర్తించినట్లున్నారు. అయితే కాంగ్రెస్, బిజేపిపు రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించేలా రాజకీయం చేస్తుంటాయి. మన దేశ రాజ్యాంగ మాత్రుక కొంత అమెరికా రాజ్యాంగ లక్షణాలను పోలివుంటుంది. కానీ మన దేశంలో బహు పార్టీల రాజకీయం సాగుతోంది. దీనిని ఎలాగో కట్టడి చేయలేం. రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే పని అసలే కాదు. అందువల్ల రెండు జాతీయ పార్టీల అంతర్గత అవగాహన ఒక్కటే సరైన మార్గం. అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి. మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి. ఇలాంటి అవగాహన రెండు జాతీయ పార్టీలలో బలంగా వుంది. ఈ విషయమై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి. తొలుత డిల్లీలో ఆప్ పార్టీని రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కేజ్రివాల్ ఏకు మేకౌతున్నాడని తెలుసుకోవడానికి రెండు పార్టీలకు పార్టీలకు పెద్దగా సమయం పట్టలేదు. చాలా త్వరగానే కోలుకున్నాయి. నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలలో వచ్చిన కేజ్రివాల్‌ను అవినీతి పరుడనే ముద్ర వేసి ప్రజలను నమ్మించగలిగారు. డిల్లీలో ఆప్‌ను ఓడిరచారు. కేజ్రివాల్ దూకుడుకు కళ్లెం వేశారు. ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు! తెలంగాణలో పురుడుపోసుకున్న బిఆర్ఎస్ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు! దీదీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి ప్రధానమంత్రి కావాలని బలంగా వుంది. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరింది. పార్టీని విస్తరించాలనుకున్నది. కుదరలేదు. తృణమూల్‌ను బెంగాల్ దాటకుండా చూసుకుంటున్నార్. ప్రధానమంత్రి కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వుంది. 2014లోనే తాను కావాలనుకున్నాడు. తన అవసరం ఏ కూటమికి వున్నా ప్రధాని పోస్ట్ కోసం ఎసరుపెట్టుకొని కూర్చున్నారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేకు మద్దతు పలికి, సిఎంగా తన ఆశలు అక్కడికే పరిమితం చేసుకున్నాడు. తోక జాడిరచే ధైర్యం చేయలేని స్థితిలో బిజేపిలో ఒదిగిపోయాడు. జేడియూను పొత్తులో బీహార్ దాటకుండా చేశారు. తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు. పరోక్షంగా అప్పుడు కేసిఆర్ కు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే కేసిఆర్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ అనగానే అదును చూసి ఇక్కడ ఒత్తేశారు. కవిత రూపంలో బిఆర్ఎస్ ను ఇరుకున పడేశారు. రాజకీయంగా ఇబ్బందుల పాలు చేశారు. దేశంలో ఏ నాయకుడు ఎదిరించనంతగా కేసిఆర్ బిజేపిని, మోడీని తూర్పార పట్టారు. బిజేపికి శత్రువయ్యారు. అలాగని కాంగ్రెస్ కు మిత్రుడు కాలేని రాజకీయాలు ఎదుర్కొన్నాడు. మొదటికే మోసం వచ్చేలా బిజేపి చేసిన రాజకీయంలో కేసిఆర్ చిక్కుకున్నారు. బిఆర్ఎస్ అనకపోతే ఇప్పుడు అధికారంలోనే వుండే వారు. కవిత రాజకీయ జీవితం ఇలా మలుపు తిరిగి వుండేది కాదు. అలా కేసిఆర్ ను కోలుకోకుండా చేశారు. ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు. అనే దశకు దేశ రాజకీయాలను తెచ్చారు. కాంగ్రెస్ ను కాదని ఆప్ ఆగమైంది. ఎవరినీ నమ్మక బిఆర్ఎస్ ఎటుగాకుండా వుంది. భవిష్యత్తు ఎలా వుంటుందనేది ఇంత కన్నా క్లారిటీ ఏమి వుండదు.