
rising child marriages.
బాల్యానికి… బంధ(న)o
పెరుగుతున్న బాల్య వివాహాలతో ఆందోళన
* అధికారుల దృష్టికి వస్తున్నవి కొన్నే..
* చిన్న వయసులో పెళ్లి వల్ల సమస్యలు
* గ్రామీణ ప్రాంతంలో ఆగని దురాచారం
* ఆడపిల్లలపై తల్లిదండ్రుల వత్తిళ్లు
* కంప్యూటర్ యుగంలోనూ సమాజం వెనక్కి
* చట్టాలు ఉన్నా మారని తల్లిదండ్రుల ఆలోచనలు
సంసారం సాగరం అన్నారు. సంద్రంలో ఈదాలంటే గజ ఈతగాళ్లకే తరం కాదు… మరి అప్పుడే ఈత నేర్చుకున్న వారిని ఆ సంద్రంలో పడేస్తే ఒడ్డుకు చేరగలరా..? బాలల పరిస్థితి అలాగే ఉంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి పేరుతో సంసారమనే సాగరంలో పడేస్తున్న తల్లిదండ్రుల తీరు ఎందరి జీవితాలకో బంధనంగా మారుతోంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కూతురుకు మూడుముళ్లు వేయిస్తే భారం తగ్గిపోతుందని కొందరు.. ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా అని పెళ్లీడు రాకున్నా పనైపోతుందని మరికొందరు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. సమాజం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా చదువును ఆపేసి బాల్య వివాహాలకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. బాల్య వివాహమంటే ముక్కుపచ్చలారని చిన్నారుల భవితకు సంకెళ్లు వేయడమే. ఇలాంటివి సమాచారం వస్తే తప్ప అధికారులు స్పందించి ఆపగలుగుతున్నారే తప్ప ఎవరికి వారు చైతన్యవంతులై వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ దిశగా అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
మారుమూల పల్లెల్లో అధికం
జిల్లాలోని మారు మూల పల్లెల్లో బాల్య వివాహాలకు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముక్యంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నారాయణ్ ఖేడ్, జహిరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలలో అధికారులకు, స్థానికులకు తెలియకుండా గూట్టు చప్పుడు కాకుండా ఇరు వైపులా పెద్దలు ఒప్పందం కుదుర్చుకొని పక్కింటి వారికి కూడ తెలియకుండా వేరే ప్రాంతాలలో బాల్య వివాహాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఐసిడిఎస్ అధికారులకు సమాచారం తెలిసి పై అధికారులకు తెలిపితే పెళ్లి జరిపించిన ఇరు వర్గాల వారు సదరు వ్యక్తిపై పోట్లాటకు దిగుతున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు.

బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు..
బాల్య వివాహాల వల్ల చాలా అనర్దాలు కలుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు తరువాతే శరీర అవయవాలు పూర్తిస్థాయిలో ఎదుగుతాయి. ఈ వయసుకన్నా ముందు వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు బలహీనంగా వుంటారు. వివాహితులైన బాలికలు బీపీ, రక్తహీనతకు గురవుతారు. పిండం ఎదుగుదల సరిగా ఉండదు నెలలు నిండకముందే ప్రవించే అవకాశం వుంది. కొన్నిసార్లు గర్భస్రావం. జరిగే ప్రమాదం కూడా వుంది. శరీర ఎదుగుదల సంపూర్ణంగా లేకపోవడం వల్ల సాధారణ ప్రసవం జరగడం కష్టమవుతుంది. పురిటిలోనే బిడ్డ చనిపోవడానికి అవకాశాలున్నాయి.
వీరంతా నేరస్తులే..
బాల్య వివాహాల నిషేద చట్టం- 2006 ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు, 21 ఏళ్లలోపు, మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరం బాల్య వివాహాన్ని జరిపించేందుకు ప్రయ త్నిస్తే ఇరుపక్షాలకు చెందిన తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లి సంఘాలు వ్యక్తులు, నాయకులను నేరస్తులుగా పరిగణిస్తారు. వీరందరికీ రెండేళ్ల జైలు శిక్షగాని, లక్ష రూపాయల జరిమానాగాని విధించే అవకాశముంది. బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ క్రైమ్ గా పరిగణి స్తారు.
బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తున్నాం
అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికల కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందుల గురించి వివరిస్తున్నాం. శరీరం ఎదగకుండా వివాహం చేసుకుంటే తరువాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్యలు ఎచురవుతాయో తెలుపుతునన్నాం. జీవన నైపుణ్యాలు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అంశాలపైనా చైతన్య పరుస్తున్నాం.

ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
బాల్య వివాహలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. చట్టం ప్రకారమే వివాహం చేయాలి. బాల్య వివాహాలు చేసుకున్న వారిలో రక్తహీనత లోపం, శిశుమరణాలు వంటి సమస్యలను చూస్తున్నాం. మరి కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కుంటుంబ నిర్వహణపై కౌమరదశలో పూర్తిగా అవగాహన ఉండదు. దీని కారణంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో తల్లి దండ్రులు బాధ్యతగా వ్యవరించడం మంచిది. బాల్య వివాహాలను అధికారులే కాదు.. స్థానిక ప్రజలు, బంధువులు అడ్డుకోవాలి.
◆:- ఝరసంగం మండల వైద్యాధికారి రమ్య