నేటిధాత్రి, వరంగల్
వరంగల్ నగరంలోని 24వ డివిజన్ లో సర్వే తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులగణన సర్వేపై సందేహాలు, అపోహలు అవసరం లేదని, ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సూచించారు. వరంగల్ నగరం జిడబ్ల్యూఎంసీ లోని 24వ డివిజన్ ఫాటక్ మోహల్లా, ఎల్లంబజార్ లలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఆర్పిలు, ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని గమనించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.
ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ వెంట ఉప కమిషనర్ కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్, ఆర్ఓ షాజాదిబేగం, ఆర్ ఐ సోహైల్, మహిళ సంఘం ఆర్పిలు తోట రాణి, పుష్పా తదితరులు ఉన్నారు.