"MLA Urges Swift Completion of Kodavatanch Temple Development Ahead of CM Visit"
కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి
స్వామి వారి పున:ప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్ రెడ్డి.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం
కొడవటంచ ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వివిధ శాఖల అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.బుధవారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బాలాలయంలో ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యవార్లు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. మరో 50 రోజుల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఫిబ్రవరి నెలలో జరిగే స్వామి వారి పున:ప్రతిష్ఠ శ్రీ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్టి పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఆలయాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రములోని మొట్టమొదటి సారిగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ ఆలయ పున:అభివృద్ధికి పనులను కొరకు రూ.12.15 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయంలో విమాన గోపుర అర్ధ మండపం, మహా మండపం, అద్దాల మండపం, ఆళ్వార్ నిలయం, పాకశాల, క్యూలైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్ మరియు తాగు నీటి సౌకర్యం తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు, సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
