మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి

ఆగిన బ్రిడ్జి పనులు
_శివరాత్రి జాతరకు సజావుగా ప్రయాణం సాగేనా?
ప్రమాద సూచికలు లేక వాహన చోదకులకు అవస్థలు
చందుర్తి నేటిధాత్రి:
వేములవాడ నియోజకవర్గం లోని
వేములవాడ -కోరుట్ల ప్రధాన రహదారి వేములవాడ మండలం మర్రిపల్లి- మూడపెళ్లి గ్రామాల మధ్యలోని వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారి మర్రిపల్లి లో హై లెవెల్ బిడ్జ్ నిర్మించేందుకు పాత రోడ్డు తొలగించి వంతెన ప్రారంభించినా పూర్తి కాలేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కస్తూర్బా పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయాయి. వంతెన నిర్మాణం పనుల్లో రెండు పర్యాయాలు భారీ వర్షాలతో గండి పడింది. దాంతో రాకపోకలు స్తంభించాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారగా వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిని డిఎస్పీ కాతురోజు నాగేంద్ర చారి పర్యవేక్షణలో మళ్లింపు చేశారు. ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంతెన దాటేందుకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. గుంతలమయంతో వాహనాలు, వాహన చోదకులు ప్రమాదకరంగా దాటుతున్నారు. ఈ ప్రాంతంలోనే ఓ ప్రమాదానికి ఓ మహిళ మృతి చెందింది. పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవ సమీపిస్తుండగా మధ్యలో మిగిలిన పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ బ్రిడ్జి పైకి ఎక్కడానికి, దిగడానికి మార్గానికి మట్టి పోసి గోడలు నిర్మిస్తే పనులు పూర్తవుతాయి….
మరో వారం రోజుల్లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాల జాతరకు దర్శనం కోసం అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుండి భక్తులు ఇదే మార్గం గుండా రావాల్సింది బ్రిడ్జి దగ్గరికి వచ్చేంతవరకు కూడా ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగా వచ్చిన వారికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. గతంలో వేములవాడ పట్టణానికి చెందిన దంపతులు జగిత్యాల జిల్లా కోరుట్లకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న మార్గంలో బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా మట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినవి రాత్రి వేళలో కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న మహిళ కింద పడడంతో ఆసుపత్రికి తరలించడంతో చనిపోయింది. గతంలో వర్షాకాలంలో భారీగా వర్షాలు పడడంతో కాలువలో నీటి తాకిడి పెరగడంతో ప్రయాణాలు కొనసాగకపోవడంతో వేములవాడ చెక్కపల్లి మార్గం గుండా మూడపెళ్లికి చేరి ప్రయాణించారు. ఈ బ్రిడ్జి పనులు ఆగిపోవడానికి కాంట్రాక్టర్, నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధుల మధ్య ఒప్పందాలు కుదరకపోవడమేనా ? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? ఏది ఏమైనా శివరాత్రి జాతరకు ముందు పనులు పూర్తిచేసి ప్రయాణానికి అందిస్తే సుదూర ప్రాంతం నుండి వచ్చేటువంటి రాజన్న భక్తులకు మార్గం సులువవుతుంది. దీంతోపాటు సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కావున సూచికలు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *