ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పలు పాఠశాలల్లో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మరమ్మత్తు పనులలో నాణ్యతా ప్రమాణాలు లోపించి నాసిరకంగా ఉన్నాయని జీలకుంట గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాగిడి మంగ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నూతన ప్రభుత్వం మంచి ఆశయంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పాఠశాలల్లో నూతనంగా ఏర్పర్చిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మండలంలోని 36 పాఠశాలలకు పాఠశాల మరమ్మత్తుల నిర్వహణకు సుమారు కోటి 52 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. పాఠశాల ఆదర్శ కమిటీలు ఈ నిధులను ఉపయోగించి తమ పాఠశాలల్లో త్రాగునీరు, ఉపయోగంలో లేని టాయిలెట్ల నిర్వహణ, తరగతి గదులకు మరమ్మత్తులు మరియు విద్యుత్ సౌకర్యాల కల్పన లాంటి వసతులను ఏర్పాటు చేయవలసి ఉంది. అయితే మండలంలోని అనేక పాఠశాలలో అధికారుల అవినీతి , కమిటీల బాధ్యత రాహిత్యం కారణంగా చేపట్టిన మరమ్మతు పనులు నాసిరకంగా ఉన్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పాఠశాలలో జరుగుతున్న పనులపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు మంగ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల వ్యవస్థ లేకుండా తమ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు పాఠశాల మరమ్మత్తుల నిర్వహణ బాధ్యతలు అప్పగించిందని అయితే వారిలో అవగాహన రాహిత్యం మరియు అధికారుల అవినీతి కారణంగా పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. భావితరాలను తీర్చిదిద్దే పాఠశాలల్లో జరిగే అవకతవకల పట్ల విచారణ జరిపి విద్యార్థులను ఆదుకోవాలని ఆమె కోరారు.ఇప్పటికైనా అధికారులు మరియు ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చకుండా తమకు లభించిన అతికొద్ది నిధులతో నాణ్యమైన పనులు చేపట్టి ప్రజల మెప్పు పొందాలని ఆమె కోరారు.