‘‘ప్రసాద్‌ రెడ్డి’’తో పోటీ పడలేం!

https://epaper.netidhatri.com/view/221/netidhathri-e-paper-29th-march-2024%09/3

కొండలాంటి ‘‘పొంగులేటి’’ని ‘‘ఢీ’’ కొట్టలేం!

`బలమైన కాంగ్రెస్‌ తో కలబడలేం.

`ఖమ్మంలో కారు ప్రయాణం కష్టమే.

`ఖమ్మం కమల వికాసం గగనమే.

`ప్రతిపక్ష అభ్యర్థుల అంతరంగం

`టికెట్‌ వద్దని మొరపెట్టుకున్నాం.

`పోటీలో వుండాలని మాత్రమే బరిలో నిలిచాం.

`చోద్యం చూడడానికి ప్రచారం చేస్తున్నాం.

`ప్రసాద్‌ రెడ్డితో పోటీ..పోశమ్మ గుడి ముందు పొట్టేలే..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఖమ్మం జిల్లాలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటనైతే జరిగింది కాని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డితో పోటీ పడాలంటే జంకుతున్నారు. బిఆర్‌ఎస్‌, బిజేపిల అభ్యర్ధులు తమకు కనీసం డిపాజిట్‌ అయినా దక్కుతుందా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. తనకు వద్దని ఎంత వారించినా, మొత్తుకున్నా బిఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించి, నిప్పులో తోసినంత పని చేసిందని నామా నాగేశ్వరరావు మధనపడుతున్నట్లు సమాచారం. ఖమ్మంలో గతంలో వున్న పరిస్టితులు ఇప్పుడు లేవన్న సంగతి తెలిసి కూడా ప్రసాద్‌ రెడ్డితో పోటీ పడడం అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అని అనుకుంటున్నారట. గత మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లాను ఊడ్చేసింది. ప్రతిపక్షాలకు స్ధానం లేకుండా చేసింది. బిఆర్‌ఎస్‌ పరిస్ధితే అలా వుందంటే బిజేపి పరిస్దితి మరీ అద్వాహ్నంగా వుంది. ఎందుకంటే ఒక దశలో మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బిజేపి నేతలు ఎంత వేడుకున్నా, ఆయన ఆ పార్టీలో వెళ్లడానికి ఇష్టపడలేదు. ప్రజల నాడిని తెలిసిన నాయకుడుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంచి పేరుంది.అంందుకే బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చి, కాంగ్రెస్‌లో చేరారు. అందులోనూ ఎంతో చాణక్యం ప్రదర్శించారు. తన బలమేమిటో శాసనసభ ఎన్నికల్లో చూపించాడు. కాంగ్రెస్‌ను ఖమ్మం జిల్లాకు కంచుకోటను చేశాడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో నిండిపోయిన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో మంత్రి పొంగులేటి చేసిన కృషి అంతా ఇంతా కాదు. గత నాలుగు దశాబ్ధాల కాలంలో ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంత శక్తివంతమైన నాయకుడు లేరు. ఈ మధ్య కాలంలో జిల్లాపై అంత పట్టున్న మరో నాయకుడు లేడు. గత శాసనసభ ఎన్నికల ముందు ఆయన చెప్పింది చేశాడు. బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటును తాకనివ్వని శపధం చేశాడు. నిలబెట్టుకున్నాడు. అంతే కాదు కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో నిలబెట్టేంత పెద్ద సభను ఖమ్మంలో ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం గొప్పగా చేశాడు. గతంలో ఎన్నడూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సభ లాంటిది జరగలేదు. ఖమ్మం జిల్లాలోనే చరిత్రలోనే నిలిపిపోయేంత సభ ఏర్పాటు చేసి, పార్టీకి నభూతో నభవిష్యతి అన్న అనే రీతిలో ఊపు తెచ్చాడు. అదీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం. అలాంటి జిల్లాలో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాల పోటీ చేయడం అంటే తమను తాము నిర్వీర్యం చేసుకోవడమే తప్ప, మరొకటి కాదు.
తమను కలుస్తున్న అనుచరులతో,పార్టీ శ్రేణులతో బిజేపి, బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు భవిష్యత్తును ఊహించుకుంటేనే ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారట.
గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఒక ఎత్తేతే ఈ ఎన్నికలు మరో ఎత్తు అని చెప్పుకుంటున్నారట. ఇక్కడ పొంగులేటి కుటుంబం కదిలించలేనంత బలంగా తయారైంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడికి అండగా అన్న అన్నట్లు జిల్లా మొత్తం మీద పట్టుసాధించారు. గత శాసన సభ ఎన్నికలే కాదు,గతంలో బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు కూడా అంతే. రాజకీయం శ్రీనివాస్‌రెడ్డి చూస్తే, క్షేత్ర స్ధాయి పర్యవేక్షణ మొత్తం ప్రసాద్‌ రెడ్డే చూసేవారు. తన అన్న శ్రీనివాస్‌ రెడ్డిదాకా ఎలాంటి సమస్య రాకుండా చూసుకునేవారు. జిల్లా మొత్తం ఆయన కనుసన్నల్లో నడిపేంత రాజకీయం కూడా ప్రసాద్‌ రెడ్డిది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ముందు సమస్య చెప్పుకునేది ప్రసాద్‌ రెడ్డికే అన్నది చాలా మందికి తెలుసు. అలా శ్రీనివాస్‌రెడ్డి తమ్ముడిగా ప్రజలకు బాగా చేరువయ్యారు. కార్యకర్తలకు చేదోడు వాదోడుగా వుంటూ వస్తున్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారిన వెంటనే ఖమ్మం జిల్లాలో గులాబీ శ్రేణులన్నీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాయి. అంటే కార్యకర్తలను ఆయన ఎంత బాగా చూసుకుంటారన్నది దీంతోనే అర్ధమౌతోంది. గతంలో శ్రీనివాస్‌రెడ్డి ఏ నియోకజవర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో పాటు, జిల్లా రాజకీయాల మీద ఆయను పూర్తి పట్టుకోసం అన్ని ప్రాంతాల కార్యకర్తలను సమానంగా చూసుకున్నారు. అదే ఇప్పుడు పొంగులేటి కుటుంబానికి కలిసివస్తోంది.
నిజానికి పొంగులేటి కుటుంబం ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితమైన నాయకత్వం కాదు.
మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వైసిపి నుంచి 2014లో పార్లమెంటుకు పోటీ చేసిన క్రమంలోనే ఆయన తెలంగాణ మొత్తం తిరిగారు. వైసిపి అభ్యర్ధులకు మద్దతుగా నిలిచారు. వైసిపి.తెలంగాణ అధ్యక్షుడుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఆయన పరిచమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది అనుచరులు వున్నారు. దాంతో ఆయన రాష్ట్ర నాయకుడిగా అప్పుడే గుర్తింపు పొందారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన వైసిపినుంచి ఎంపిగా గెలవడమే కాదు, ఇద్దరు శాసన సభ్యులను కూడా ఖమ్మంలో గెలిపించుకున్నాడు. అప్పుడే అంతటి శక్తివంతమైన నాయకుడుగా పేరు పొందిన పొంగులేటి గతపదేళ్ల కాలంలో ఖమ్మం జిల్లాను శాసించే నాయకుడిగా ఎదిగారు. బిఆర్‌ఎస్‌ పొంగులేటి ప్రాతినిధ్యాన్ని, ప్రాదాన్యతను ఎంత తగ్గించాలని చూసినా, ఆయన ప్రాభవం పదిరెట్లు పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఎదురులేని నాయకుడయ్యాడు. తిరుగులేని శక్తిగా రాజకీయాలను శాసిస్తున్నారు. అలాంటి నాయకుడి తమ్ముడైన ప్రసాద్‌రెడ్డి ఖమ్మం పార్లమెంటు బరిలో వుండగా ప్రతిపక్షాలకు ఓట్లు ఎన్ని వస్తాయో ముందే ఊహించొచ్చు.
ఎట్లా చూసినా ఖమ్మంలో వార్‌ వన్‌ సైడే వుంటుందనేది నిర్వివాదాంశం.
ఖమ్మం మొత్తం కాంగ్రెస్‌ కంచుకోటగా మారిపోయింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయంతో నిండిపోయింది. ఇక ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకే. మరోవైపు ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కవున్నారు. మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వున్నారు. ముగ్గురు క్యాబినేట్‌ మంత్రులు వుండగా ఖమ్మంలో కాంగ్రెస్‌ గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం వుంటుందా? మెజార్టీ మీదే లెక్కలుంటాయి. ఎంత మెజార్టీ వస్తుందని అంచాలుంటాయి. అంతే తప్ప ప్రతిపక్షాల గురించి చర్చే కనిపించదు. వినిపించదు. అందుకే మేం పోటీ చేయమంటూ అభ్యర్ధులు ఎంత మొత్తుకున్నా ప్రతిపక్ష పార్టీలు నిలబెడుతున్నాయి. టికెట్లు ప్రకటించాయి. అంతే కాదు ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం.. అంటూ పార్టీలు భరోసా కూడా ఇచ్చాయి. అయినా పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకున్నట్లు గతంలో గెలిచిన చోట ఓడిపోవడం రాజకీయ పతనానికి దారి వేసుకున్నట్లే అని నామా భయపడుతున్నారట. గెలుస్తామని నమ్మకం వున్నప్పుడు పోటీ చేయొచ్చు. కనీసం గట్టి పోటీ ఇస్తామన్న విశ్వాసం వున్నప్పుడైనా పోటీ చేయొచ్చు. కాని అసలు పోటీ చేయడం వృదా అని తెలిసి పోటీ చేయడం వల్ల ఎలాంటి లాభం వుండదు. ఎన్నికల ఖర్చు పార్టీ పెట్టుకుంటుందని ఎంత చెప్పినా ఎన్నికల సమయంలో ఎలా వుంటుందో తెలియనంత అమాయకుడు కాదు నామా? అందుకే టికెట్‌ వద్దంటూ వేడుకున్నాడట. పొంగులేటి రాజకీయం చూసి జంకుతున్నాడట. ఏది ఏమైనా ఖమ్మంలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీస్తోంది. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌వాళ్లే కావడం గమనార్హం. మరోవైపు కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో వున్నారు. శ్రేణులు ఎంతో దూకుడుగా పనిచేస్తున్నారు. శాసన సభ ఎన్నికలు అయిపోయిన నాటి నుంచి ప్రసాద్‌ రెడ్డి ప్రజల్లోనే వుంటున్నారు. కార్యకర్తలకు తోడుగా వుంటున్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ప్రజల సాధక బాధకాలలో పాలు పంచుకుంటున్నారు. అందువల్ల ప్రసాద్‌రెడ్డికి టికెట్‌ వస్తే ఆయన గెలుపు మామూలుగా వుండదంటున్నారు. తెలంగాణలోనే చరిత్ర తిరగరాసే రికార్డు సొంతమయ్యేలా మెజార్టీకోసం కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *