AIKF Demands ₹30,000 Compensation per Acre for Cyclone-Hit Farmers
ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
మోoథా తుఫానుతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల సహాయాన్ని ప్రకటించి భరోసా కల్పించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్థానిక ఓంకార్ భవన్ లో జరగగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన మోoథా తుఫానుతో 5 లక్షల మంది అన్నదాతల కుటుంబాల బ్రతుకులు ఆగమ్యగోచరంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.చేతికచ్చే దశలో అధిక వర్షాలు, తుఫాన్లు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు.మోoథా తుఫానుతో రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో సుమారు పది లక్షల ఎకరాల్లో వరి,పత్తి,మొక్కజొన్న,మిర్చి ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం నాలుగు లక్షల 47 వేల ఎకరాలలో దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు వేసింది సరైంది కాదని ఆరోపించారు.క్షేత్రస్థాయిలో రైతుల పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన పంటలను నిర్దిష్టంగా అంచనా వేయాలని ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే విధంగా ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అలాగే వ్యవసాయ పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంస రెడ్డి, కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు మహమ్మద్ ఇస్మాయిల్, సింగతి మల్లికార్జున్ ,నాగెల్లి కొమురయ్య,వక్కల కిషన్,వడ్త్య తుకారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
