ధరలు.. గుండెల్లో గుబులు!

`సంపాదన పాతాళం..ఖర్చు ఆకాశం.

`పండగ వేళ ధరల మోత.

`వంటింట్లో ధరల మంట.

`నూనె సలసల కాగుతోంది.

`కారం నషాలానికెక్కుతోంది.

`ఉప్పు నాకేం తక్కువ అంటోంది.

`పసుపు పైపైకి వెళ్తోంది.

`పూలు పసిడితో పోటీ పడుతున్నాయి.

`తగ్గినట్లే తగ్గిన బంగారం భగ్గుమంటోంది.

`వెండి వేడిని తట్టుకోండని సవాలు విసురుతోంది.

`సామాన్యుడి గుండె కలలో ధర..ధర అని కలవరిస్తోంది.

`సగటు బతుకు కలవరపడుతోంది.

`సంపాదన మూరెడు…ఖర్చు బారెడు.

`నెల సంపాదన పది రోజులకే హుళక్కి.

`అప్పు చేస్తే గాని గడవని రోజులివి.

`అప్పు పుట్డకపోతే పస్తులే దిక్కు.

`మంచినీటి క్యాన్‌ కూడా వెక్కిరిస్తోంది.

`అర్థాకలి జీవితం దిక్కవుతోంది.

`మధ్య తరగతి బతుకు కలిమి లేమికి మధ్య వేళాడుతోంది.

`కడుపు నింపుకోలేక, ఆకలికి ఆగలేక సగటు కుటుంబం పస్తులుంటోంది.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ధరలు బాబోయ్‌ ధరలు అని ప్రజలు గుండెలు బాదుకుంటున్నా పాలకులకు కనికరం కలగడం లేదు. పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ఆలోచనలు కూడా పాలకులు చేయడం లేదు. ధరలను అదుపులో పెట్టాలన్నా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఇవి ఏ ఒక్కరి సమస్య కాదు. ఒక్క కుటుంబం బాధ కాదు. ఇండియాలో వున్న కోట్లాది కుటుంబాలలో నిత్యం అనుభవిస్తున్న వేధ. ఉప్పు వుంటే కారం వుండదు. కారం వుంటే పసుపుండదు. అందులోకి నూనె కరువు. పోపు గింజల చిటపటలు. సగటు వ్యక్తి ఏం తినాలి? అన్న ప్రతిపక్షాలకు కూడా పట్టడం లేదు. ఎంత సేపూ రాజకీయాలు. ఆరోపణలు. అవినీతి విమర్శలు. పార్టీల మధ్య ఆధిపత్యాలు. ఇంతకంటే దేశంలో సమస్యలు లేవా? మధ్య తరగతి జీవితాల గురించి పట్టింపు వుండొద్దా! మార్కెట్‌ ఎలా వుంది. సామాన్యుల జీవితాలు ఎలా గడుస్తున్నాయి? అమెరికా దేశంలో 15 నుంచి20 శాతం మంది ఇన్‌ కమ్‌ టాక్స్‌లు కడుతున్నారు. మన దేశంలో 3 మూడు శాతానికి మించి టాక్స్‌ చెల్లించడం లేదని అర్థిక లెక్కలు చెబుతారే గానీ, నూటా యాభై కోట్ల మంది ప్రతి వస్తువు మీద ప్రభుత్వాలు వేస్తున్న పన్నులు చెల్లిస్తూనే వున్నారు. నిజానికి ప్రతి వ్యక్తి చెల్లించే పన్నుల్లో ప్రతి రూపాయి ఎటు పోతోందో ఎవరైనా చెబుతున్నారు. నిత్యం వంద కోట్ల మంది కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువు మీద వెళ్తున్న పన్నుల మూలంగా దేశానికి వస్తున్న ఆదాయంలో ప్రజలకు చేరుతున్నది ఎంత? ఆ విషయం పక్కనపెడితే ప్రతి వ్యక్తి తన సంపాదనలో ప్రతి పైసా వస్తు సేవలకే చెల్లిస్తున్నాడన్న ఆలోచన ఎవరికైనా వుందా? ఇక జిఎస్టీ తెచ్చి పెట్టడం వల్ల సగటు వ్యక్తి ఇల్లు గుల్లవుతోందని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మార్కెట్‌లో ఎండు మిర్చికి వున్న ధర ఎంత? పొడి చేసి ప్యాకెట్లలో అమ్ముతున్న కారం పొడి ధర ఎలా వుందని ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా? మిర్చీ పండిరచిన రైతు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుంటున్నాడు. అదే మిర్చిని ఫౌడర్‌ చేసి అమ్ముకుంటున్న కంపెనీ ధరను ప్రభుత్వాలు అంగీకరించి, దానికి అదనంగా జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు లాభ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వాల నిర్లక్ష్యాల మూలంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్యుడి సంపాదన పాతాళంలో వుంది.ఖర్చు ఆకాశం ఆకాశాన్ని తాకుతోంది. ఇటీవల విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పండగ వేళ ధరల మోత మోగుతోంది. వంటింట్లో ధరల మంట మండుతోంది. గత నెలకు ఈ నెలకు పెరిగిన ధరలతో నూనె సలసల కాగుతోంది. కంపెనీలు ఇష్టాను సారం పెంచిన ధరలతో ప్యాకెట్‌ మీద ధర చూస్తేనే కారం నషాలానికెక్కుతోంది. ఒకప్పుడు అన్నింటికన్నా తక్కువ. అగ్గువ అనుకునే ఉప్పు చిటపటలాడుతోంది. ఉప్పు నాకేం తక్కువ అంటోంది. పసుపు పైపైకి వెళ్తోంది. ఇక పండగ పూట పూజలు చేసుకునే వారికి పూలయ చక్కలు చూపిస్తున్నాయి. పూలు పసిడితో పోటీ పడుతున్నాయి. కిలో పూలు వందలు దాటి వేలకు పరుగెత్తుతున్నాయి. పది కిలోల పూలకు వేలు ఖర్చవుతున్నాయి. ఇక సుంకం తగ్గడంతో బంగారం బారీ పతనం అని ఊరించారు. ఏమైంది. సుంకం తగ్గింపు ఎక్కడికిపోయింది. బంగారం ధర ఎందుకు పైపైకి ఎగబాకుతోంది. సుంకం తగ్గించక ముందు వున్న ధరను మించి తర్వాత ఎందుకు బంగారం ఎనభై వేలు దాటింది. తగ్గినట్లే తగ్గిన బంగారం భగ్గుమంటోంది. వెండి వేడిని తట్టుకోండని సవాలు విసురుతోంది.

సామాన్యుడి గుండె కలలో ధర..ధర అని కలవరిస్తోంది. సగటు బతుకు కలవరపడుతోంది. సంపాదన మూరెడు…ఖర్చు బారెడు పెరిగిపోయింది. నెల సంపాదన పది రోజులకే హుళక్కి అవుతోంది. అప్పు చేస్తే గాని గడవని రోజులు ఎదురౌతున్నాయి.అప్పు పుట్డకపోతే పస్తులే దిక్కువుతున్నాయి. మంచినీటి క్యాన్‌ కూడా వెక్కిరిస్తుంటే కన్నీళ్లు విలవిలలాడుతున్నాయి. అర్థాకలి జీవితం దిక్కవుతోంది.మధ్య తరగతి బతుకు కలిమి లేమికి మధ్య వేళాడుతోంది. కడుపు నింపుకోలేక, ఆకలికి ఆగలేక సగటు కుటుంబం పస్తులుంటోంది. ధరలు దిగిరావా! ప్రజలు అత్రంగా ఎదురుచూస్తున్నారు. పండగలకు ధరల మంట మండిపోతోంది. ప్రతి వస్తువు పిరమౌతోంది. ధరలు దిగిరావా అని ఎదురుచూసే సామాన్యుడికి ప్రతి నిరాశే మిగులుతోంది. గత మూడు నెలలుగా ఉల్లి ధరలు అమాంతం పెరిగి పోయాయి. వెల్లుల్లి మాట చెప్పనక్కర్లేదు. ఉప్పు ధరలు కూడా విపరీతంగా పెరగడం మరీ విచత్రం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయో అర్థం కాదు. సగటు వ్యక్తి పండగ పూట కూడా సంతోషంగా లేని పరిస్థితులు ఎదురౌతున్నాయి. పెరుగుతున్న ధరలపై అలసత్వం ఎందుకు వహిస్తున్నారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ధరలెంత పెరిగితే అంత జీఎస్టీ వస్తుందని వదిలేస్తున్నారా! అని సామాన్యుడు నిలదీస్తున్నాడన్న సంగతి కూడా పాలకులకు చేరడం లేదు. అసలు ఉల్లిఘాటు బిజేపి నేతలకు తగలడం లేదా? ధరలు తగ్గిస్తామని చెప్పడం తప్ప చేస్తున్నదేమీ లేదు. ఇటీవల వంట నూనెలు కాస్త తగ్గాయని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ నూనెల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగుతున్న నూనెలు సలసలమంటున్నా తెలియడం లేదా! అని సమాజం నుంచి నిలదీతలు మొదలైతే గాని స్పందించరా! పప్పుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సామాన్యుడి సంపాదన పన్నుల కింద పకోడిపొట్లాలౌతున్నాయి. రోజంతా కష్టపడినా కూలీ గిట్టుబాటు కావడం లేదు. చేసిన పనికి సరైన వేతనాలు అందడం లేదు. కానీ ధరలు మాత్రమే ఎప్పుడూ పైపైకి ఎగబాకుతూనే వున్నాయి. రోజంతా కష్టపడినా సగటు వ్యక్తి కడుపునిండిరది లేదు. కంటికి నిద్రరాదు…రూపాయి జేబులో నిలవదు! ఏం కొనలేం..తినలేం! ఉల్లి ఘాటు..వెల్లుల్లి కాటు వింటేనే కళ్లకు నీళ్లొస్తున్నాయి. పచ్చి మిర్చీ భగభగ మంటోంది. ఎండయ కారం మండిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఎండు మిర్చి ఏడిపిస్తోంది. టమాట…నోట మాట రానివ్వడం లేదు. టమోటా ధరలు ఎందుకు పెరుగుతాయో ఎవరికి తెలియడం లేదు. అటు రైతు బాగుపడిరది లేదు. ఇటు వినియోగదారుడికి ఊరట లభించిన సందర్భం లేదు. సబ్బులు…అబ్బో ధరలు అని ఆగమయ్యే స్థితిలో వున్నాయి. కరోనాకు ముందు సబ్బుల ధరలు ముప్పై లోపే…కానీ ఇప్పుడు నలభై దాటిపోయాయి. మమ్మల్ని కొనడానికి మీ పప్పులు ఉడకవని సవాలు చేస్తున్నాయి. అందరూ తినే ఆలు అటు వైపు చూడకంటున్నాయి. పిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పంగకు ముందే పిరమైంది…పసుపు బంగారం కంటే నేనే తక్కువ అన్నట్లు పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి సామాన్యడి బతుకు కుతకుతమంటోంది. కడుపు మంటకు తోడు ధరల మంటతో కడుపు రగిలిపోతోంది. ఇప్పటికే విపరీతంగా ధరలున్నాయని దిగులు పడుతున్న సామాన్యులకు ధరలకు మళ్ళీ రెక్కలు! అన్న వార్తలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉత్తరాధిన కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పరిస్థితులు ఇలా వున్నాయంటే అసలు మామూలు పరిస్థితులు వుంటే ధరల మోత మరింత మోగేదేమో! ఆయా రాష్ట్రాల ఎన్నికలు పూర్తయితే జనానికి మరింతగా చుక్కలు తప్పవని మాత్రం అర్థమౌతోంది. అటు నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత విరివిగా జరుగుతోంది. ఉల్లి కృత్రిమ కొరతలో చిక్కి ప్రజలను విలవిలలాడేలా చేస్తున్నారు. ఎడతెరపుండా జనానికి పన్నుల వాత తప్పని పరిస్థితులే ఎప్పుడూ ఎదురౌతాయేమో అన్న దిగులే అందరిలోనూ వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *