Colorful Paintings but Dark Flyover at Kathanpally
బ్రిడ్జి సైడ్ వాల్స్ పై కలర్ ఫుల్ పెయింటింగ్స్…! చిమ్మ చీకట్లో బ్రిడ్జి పై రహదారి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేసి పది నెలలుగా రాకపోకలు జరుగుతున్నప్పటికీ బ్రిడ్జిపై లైటింగ్ లేకపోవడం తో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని, దీనిని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల రాత్రి సమయాల్లో ప్రయాణికులు,పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఇరువైపులా ఇసుక ఉండటం తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, స్థానిక మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకుని బ్రిడ్జి పై ఇరువైపుల ఉన్న ఇసుకను తొలగించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఫ్లై ఓవర్ వంతెనకు ఇరువైపులా కలర్ ఫుల్ పెయింటింగ్స్ తో కళకళలాడుతున్నాయి. ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దారిన పోయే ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ, సింగరేణి, ప్రజల జీవనశైలి,జంతువులు, పక్షులు,క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడియాడినట్లు దర్శనమిస్తున్నాయి. చిత్రలేఖనాలు బాగానే ఉన్నా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు మున్సిపల్ సిబ్బంది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలిగేలా చొరవ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

నెల రోజుల్లో బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలుగులోకి వస్తాయి..
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు..
క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు నెల రోజుల్లో వెలుగుతాయని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారని అన్నారు. పది నెలలుగా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఆర్ అండ్ బి అధికారులను పదేపదే అడగడం జరిగిందని,విద్యుత్ స్తంభాలకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వెలిగేలా చూస్తామని తెలిపారు. ఫ్లై ఓవర్ పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇసుకను త్వరితగతిన తొలగిస్తామని, వాహన ప్రమాదాలు జరగకుండా చూస్తామని అన్నారు.
