అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,నేటి ధాత్రి:
ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం,నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు/పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేసేందుకు పంట సాగుకు అవసరమైన వ్యవసాయ అధునాతన పరికరాలను అర్హులైన రైతులకు అందించి పంట దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం ఎస్.ఎం.ఎ.ఎం. 2025-26 లో భాగంగా అర్హులైన రైతులకు యాంత్రికరణ పరికరాలను అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించి రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా లబ్ధి పొందేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
