Panchayat Elections
పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.
