Collector Inspects Nomination Centers and Rice Procurement
నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
