త్వరలో గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

● నెలాఖరున గల్ఫ్ దేశాలలో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు 

● గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞత తెలిపిన గల్ఫ్ జెఏసీ బృందం 

గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపింది. గల్ఫ్ హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. 

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఈ బృందంలో ఉన్నారు. 

ఈ సందర్బంగా డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మానవత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. 

హైదరాబాద్ లో ఈనెల 15 తర్వాత గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ నెలాఖరుకు గల్ఫ్ దేశాలలో పర్యటిస్తారని ఆయన అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!