అంబేద్కర్ ఓ అద్భుతం:
“నేటిధాత్రి” హైదరాబాద్
భారతదేశంలో అంబేద్కర్ ఓ అద్భుతమని, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఛాంబర్ లో ఈరోజు మధ్యాహ్నం బీసీ కమిషన్ తొలి చైర్మన్ బిఎస్ రాములు భారత రాజ్యాంగం, ఓబీసీలకు అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ప్రస్థావన పేరుతో
రాసిన ‘బీసీ నోట్’ పుస్తకావిష్కరణను సిఎం రేవంత్ రెడ్డి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సామాజిక వర్గానికి, కులానికి ప్రాతినిధ్యం, అవకాశం జనాభా దామాషా మేరకు ప్రతిపాదించి అమలు జరిపితే అన్ని ప్రాంతాలకు, కులాలకు, వర్గాలకు సంబంధించిన వారికి అవకాశాలు అందుతాయని, తద్వారా ఆయా సామాజిక వర్గాల్లో, కులాల్లో ఒక స్ఫూర్తి, ఉత్తేజంతోపాటు వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని, తద్వారా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో, ఆచరణలోకి వస్తుందని అన్నారు. ఈ సందర్బంగా కులగణనపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేశవ్యాప్తంగా ఓబిసి రిజర్వేషన్ల అమలుకై భారతీయ ఓబిసి సమాఖ్య చేస్తున్న ఉద్యమానికి మద్దతు కావాలని భారతీయ ఓబిసీ సమాఖ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు, కె.కోటేశ్వర్ రావు, పుస్తక రచయిత, ఓబిసి సమాఖ్య గౌరవ అధ్యక్షులు బిఎస్ రాములు కోరారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఓబిసి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరావు, రాష్ట్ర సభ్యులు చింతకాయల వెంకటేశ్వర్లు, శీలం శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, కోమటిరెడ్డి వెంకరెడ్డిలకు ప్రత్యేకంగా భారతీయ ఓబిసి సమాఖ్య సభ్యులు అందచేశారు. అలాగే మిగిలిన అందరి శాసనసభ్యులకు, ప్రభుత్వ అధికారులకు ఉచితంగా అందించారు.