
"Madhukar Rages at CM Revanth"
మతిభ్రమించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి…
ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టింది శ్రీపాదరావు అనడం విడ్డూరమే
ప్రాజెక్టులను పూర్తి చేసిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్‌దే
– పోరాడి సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నరు
– సీఎం పక్కనే ఉండే మంత్రికి జ్ఞానం లేదని తెలుస్తోంది
– గవర్నర్..రాష్ట్రపతి స్పందించి ప్రభుత్వాన్ని రీకాల్ చేయాలే
– సీఎంను, మంత్రులను పిచ్చి ఆస్పత్రికి పంపించాలని కోరుతున్నా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మంథనిలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిట్టడం, ఒర్రడం తప్ప ఒక్క మంచి మాట మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు మాట్లాడినా హైట్ల గురించి వెయిట్ గురించి తప్పితే మరోమాట లేదని, అసలు మీ హైట్‌కు తగ్గ మెదడు ఉందా అని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చికూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకోలేక, ఈ సమాజం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా మాట్లాడవలసి వస్తుందన్నారు. హైదరాబాద్ నీళ్లు మూసి నది కి వెళ్లే కార్యక్రమ శంఖుస్థాపనలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది శ్రీపాదరావు అని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ మాట్లాడారని, అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై పూర్తిగా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంబిస్తే 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారని గుర్తు చేశారు. 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు మృతి చెందితే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎలా కట్టారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో పక్కనే ఉన్న మంత్రి అయినా చెప్పాలి కదా అది శ్రీపాదరావు కట్టించలేదని, అంటే చదువుకున్న మేధావి అని పక్కన ఉండే మంత్రికి కూడా తెలివి, జ్ఞానం లేదని తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో ఉన్న వారికి తెలివి లేదని తేలిందని విమర్శించారు.ఆనాడు ఎల్లంపల్లిని పూర్తి చేసిన హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోయేవాళ్లు కాదని, మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకుని జేబులు నింపుకున్నారని, ఊర్లమీద పైపులు వేయడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఆనాడే జలయజ్ఞం ధనయజ్ఞమని ఊరూర ప్రచారం జరిగిందన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే అంటున్న ముఖ్యమంత్రి ఇక్కడి వచ్చి చూస్తారా అని సవాల్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీవద్దకు వచ్చి ఏం డ్యామేజ్ అయిందో చూపించాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని, నందిమేడారం గాయత్రీపంపుహౌజ్ పూర్తి చేసి అక్కడి నుంచి మిడ్ మానేరు, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లను ఎస్సారెస్పీ వరద కాలువలో కలిపిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. ఈనాడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పాలకులు తెల్లకళ్లు తాగిన కోతుల్లా ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హమీ నెరవేర్చలేదని, గొప్ప ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఎక్కడ ఐదు వందల బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని యూరియా కొరత సృష్టించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ వ్యవహరంపై బారత అత్యున్నత స్థానమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు స్పందించి ఈ ప్రభుత్వాన్ని రీకాల్ చేయాలని ఆయన కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి ప్రపంచమంతా తిరిగి మనకు ప్రజాస్వామ్యం అందించారని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆయన వాపోయారు. సంవిధాన్ బచావ్ అంటూ దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణాపై దృష్టిపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలకులకు పాలన చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. సమాజం తిరుగబడకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళ్లు తెరిచి మంచిగా మాట్లాడాలని, పక్కన తెలివికల వారిని కూర్చోబెట్టుకోవాలని హితవు పలికారు