రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు
“నేటిధాత్రి”, హనుమకొండ
రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులను సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కాకుండా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అందించిన వసతి సౌకర్యాలపై కోచ్ లు మేనేజర్లను అడిగారు. వీరితో పాటు డీసీపీ దేవేందర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, డివైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కె.సారంగపాణి, మహ్మద్ కరీం, ఎన్ఐటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డా.రవికుమార్ లు పాల్గొన్నారు.
హనుమకొండ రెజ్లర్ల హవా…
రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ లో హనుమకొండ జిల్లా రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ , ఒక రజతం, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ 60 కేజీలో వి. గణేష్ స్వర్ణం, 53కేజీలో బి.అంజలి, 48 కేజీల విభాగంలో ఎస్.అర్జున్ సాగర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. జూనియర్ బాలికల 50 కేజీల విభాగంలో బి. ప్రణవి, 59 కేజీలో జె.చిన్ని , 61కేజీలో కొర్ర అఖిల్ స్వర్ణ పతకం
సాధించగా, 57కేజీలో ఎ.రాహుల్ రజత పతకం కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను హనుమకొండ జిల్లా క్రీడల యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు వై.సుధాకర్, షేక్ రియాజ్, కోచ్ లు కందికొండ రాజు, ఎం.జైపాల్ లు అభినందించారు.