వెంకటాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని శుక్రవారం రోజు వెంకటాపూర్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.రాధిక ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు అల్పాహారంలో భాగంగా పిల్లలకు పూరి మరియు ఆలుకుర్మాను వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అల్పాహార పథకం చాలా బాగుందని, దీని ద్వారా పిల్లల్లో తరగతి గదిలో ఆకలి నివారించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం మరియు పెరుగుదలను మెరుగుపరచడం, ప్రతిరోజు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రోత్సహించడం, నమోదు శాతాన్ని పెంచడం, డ్రాప్ అవుట్ రేటును తగ్గించడం, సాంఘీకీకరణను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. పిల్లల ఆరోగ్యం విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమని కొనియాడారు. పాఠశాల సమయానికి 45 నిమిషాల ముందే పిల్లలకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని మెనూ ప్రకారం సోమవారం ఇడ్లీ సాంబార్, మంగళవారం పూరి ఆలు కుర్మా, బుధవారం ఉప్మా సాంబార్, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ సాంబార్, శుక్రవారం ఉగ్గాని లేదా అటుకులు చిరుధాన్యాల ఇడ్లీ చట్నీ, శనివారం పొంగల్ సాంబార్ లను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, మహేష్, కిరణ్ కుమార్, సత్యం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.