Faction Fight Slows Warangal East Development
వరంగల్ తూర్పులో వర్గపోరు..
అభివృద్ధిలో వెనుకబడిన ఓరుగల్లు!
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ అంతర్గత కలహాలు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు ఏర్పాటు చేసిన రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై కాకుండా పదవుల కోసం జరుగుతున్న కసరత్తులు, వర్గపోరాటాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు, వరద బాధితుల నష్టపరిహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టగా.., అధికార పార్టీ నాయకులు మాత్రం అంతర్గత రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల్లో మునిగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు పక్కన పడుతున్నాయన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. అభివృద్ధి పరంగా పరిశీలిస్తే, వరంగల్ తూర్పు పక్క నియోజకవర్గమైన పశ్చిమతో పోలిస్తే వెనుకబడింది. ముఖ్యంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిలో తూర్పు ప్రాంతం నిర్లక్ష్యం గురవుతోంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ హన్మకొండలోనే కొనసాగుతుండటం స్థానికులకు ఆవేదన కలిగిస్తోంది. సమస్యలను పరిష్కరించడంలో కాకుండా వర్గపోరు, అంతర్గత రాజకీయాలతో ముందంజలో ఉండే నాయకుల ధోరణి స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “పదవుల కోసం పోరాటాలు, అధికార పార్టీ రెండు వర్గాల మధ్య తూర్పు నాయకుల ప్రవర్తన వింతగా కొనసాగుతున్నా, ప్రజా ప్రయోజనాల కోసం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు” అనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రజలు ఆశిస్తున్నది అభివృద్ధి, పారదర్శక పాలన. కానీ రాజకీయ నాయకులు మాత్రం సమీకరణాల గణాంకాల్లో చిక్కుకుని వరంగల్ తూర్పు ప్రజల ఆకాంక్షలను మరచిపోయినట్టే కనిపిస్తున్నారు.
