సన్న బియ్యం.. పేదలకు వరం.మిల్లర్లకు ఎప్పుడూ వుంటుంది సహకారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ ‘‘దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌’’ ఇచ్చిన సమాధానాలు…
`సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం.

`సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం.

`రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు.

`నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి.

`నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్‌.

`సన్న బియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం.

`పాలకుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

`సన్న బియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం.

`మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు వుంటాయి.

`ఏ మిల్లరైనా సరే నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చు.

`మిల్లర్ల వ్యవస్థ ఎంత బాగుంటే సన్న బియ్యం సరఫరా అంత బాగుంటుంది.

`సన్న బియ్యం సరఫరాపై ‘‘ఐఎస్‌ఓ’’ సర్టిఫికేట్‌ కూడా అందించింది.

`‘‘ఫైవ్‌ స్టార్‌’’ రేటింగ్‌తో సన్న బియ్యం సరఫరా సక్సెస్‌ అయ్యింది.

`ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు.

`ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్న బియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు.

`తాజాగా జార్ఖండ్‌ నుంచి మంత్రితో పాటు, అధికారులు వచ్చారు.

`వారికి పరవ్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది.

`ఇప్పటికే ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

`వారి రాష్ట్రాలలో అమలు కోసం అవసరమైన సలహాలు తీసుకున్నారు.

`‘‘నలభై ఏళ్ల’’ క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.

`ఇప్పుడు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడమంటే గొప్ప కార్యక్రమం.

`ఆహార భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి
కట్టా రాఘవేంద్రరావు: సార్‌..నమస్తే..
దేవేంద్రసింగ్‌ చౌహాన్‌: నమేస్తే…
కట్టా: ఎలా వున్నారు?
చౌహాన్‌: బాగున్నాను..మీరు.
కట్టా: హపీ సార్‌…సన్నబియ్యం ఒక సంచలనం అంటున్నారు. ప్రజల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది?
చౌహాన్‌: నిజం చెప్పాలంటే ఇది ఒక అర్భుతమైన ఫీలింగ్‌ అని చెప్పాలి. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం ఏముంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల లక్ష్యం. అందులోనూ కూడు, గూడు, గుడ్డ కూడా సమకూర్చే పథకాల అమలు చేసిన ప్రభుత్వాలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి. నిజానికి ప్రజలను ఆకలి బాధలు పడకుండా ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాకపోకపోయినా, సన్న బియ్యం పధకం కొత్తగా వుంది. ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చడంమొదలు పెట్టి కొన్ని దశాబ్దాలౌతోంది. కాని ఇంత విసృత స్ధాయిలో ప్రజలకు ఆహారభద్రత కల్పించడం అన్నది కొంత కాలం నుంచి మాత్రమే వస్తోంది. ముఖ్యంగా 1985 నుంచి ఈ పధకం గొప్పగా అమలు జరుగుతోంది. అప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అన్నది ఇప్పటికీ అమలు జరుగుతుండడం మంచి పరిణామం. అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అమలు మొదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు గుడుస్తోంది. అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు కూడా నాకు తెలిసి రూ.4 వరకు వుండొచ్చు. అప్పట్లో సన్న బియ్యం కూడా అదే ధరలో వుండొచ్చు. తర్వాత ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం సాద్యం కావడంలేదని కిలో బియ్యం రూ.5కు పెంచిన ప్రభుత్వంకూడా వుంది. కాని 1985లో ఎన్టీఆర్‌ సమయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు జరిగిన తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1.90పైసలకు కిలో బియ్యం అందించింది. తర్వాత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం దాని ధర పెంచింది. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కిలో రెండు రూపాయలకు మళ్లీ ఆ పదకం అమలు చేశారు. అయితే అప్పటికి మార్కెట్‌లో బియ్యం పది రూపాయలకు పైనే వుంది. తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానిని రూపాయికి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం సరఫరాచేస్తున్నప్పటికీ సన్నబియ్యం సరఫరా అన్నది ఒక విప్లవాత్మకమైనది. గతంలో ప్రభుత్వాలు హమీలు ఇచ్చాయి. కాని అమలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం దరలు రూ.50 వరకు పలుకుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంతే కాకుండా అది నేను కమీషనర్‌గా వున్న సమయంలో అమలు కావడం కూడా నా అదృష్టం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం విషయంలో అనేక రకాల వార్తలు వుండేవి. ఆ బియ్యం ప్రజలు అమ్ముకొని, సన్న బియ్యం కొనుగోలు చేసుకునేవారు అనే వార్తలున్నాయి. కాని ఇప్పుడు ఆ బియ్యం స్ధానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల, పేద ప్రజలపై కొంత భారం తగ్గింది. అందరూ సన్న బియ్యం తినే సమాజ నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. సామాన్యులకు సన్న బియ్యం తినాలన్న ఆశ తీర్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. బియ్యం తీసుకెళ్లిన వారు ఎంతో సంతోషంగా తింటున్నారు. గతంలో బియ్యం అమ్ముకొని మరిన్ని రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొంత మంది తెచ్చుకునేవారు. కాని ఇప్పుడే పేద, మద్య తరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేదు. తెలంగాణలో అందరూ సన్న బియ్యం తింటున్నారంటే గొప్ప విషయం.
కట్టా: సన్న బియ్యం పధకం అమలుపై ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చింది? ఎలా ఫీల్‌ అవుతున్నారు?
చౌహాన్‌: ఇక ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నదే కాదు ఎంత క్యాలిటీ బియ్యం ఇస్తున్నామన్నది కూడా గుర్తించారు. మార్కెట్‌లో లభించే బియ్యం కన్నా, అదనంగా పోషకాలు వుండే బియ్యం కూడా కలిపి, ప్రజలకు ఆహార భద్రతే కాదు, ఆరోగ్య భద్రత కూడా చేకూర్చేలా బియ్యం సరఫరా జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్దాయిలో తెలంగాణలో సన్న బియ్యం పధకం పేరుగాంచింది. ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పౌరసరసరఫరాల శాఖకు అందించింది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఎంతో సంబురంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.
కట్టా: ఈ పథకం అమలుపై ఇతర రాష్ట్రాలలో ఏదైనా ప్రభావం వుందా?
చౌహాన్‌: తెలంగాణలో సన్న బియ్యం పధకం అమలు అన్నది ఒక సంచనలంగా మారింది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి వారి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. సమయం కావాలని కోరుతున్నారు. తాజాగా రaార్ఖండ్‌ రాష్ట్ర మంత్రితోపాటు, ప్రతినిధి బృందం రావడం జరిగింది. ఎలా సాద్యమౌతుందన్న దానిపై వారికి పూర్తి వివరాలు అందించడం కూడా జరిగింది. అందుకు అవసరమైన డెమోతోపాటు, పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లంతా ఆశ్యర్యపోయారు. తప్పకుండా తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం అమలు చేయడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అందుకు ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది, అంకితభావం వుంటే తప్ప జరగదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానస పుత్రికగా సన్న బియ్యం పధకం అందరూ చెప్పుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నబియ్యం పదకం అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ బాద్యతలు నిర్వర్తిన్న నాకు కూడా ఎంతో సంతోషంగా వుంది.
కట్టా: మీకు మరో ప్రశ్న. సన్న బియ్యం పదకం అమలులో కీలకమైన రైస్‌ మిల్లర్లు వారి సమస్యలున్నాయంటున్నారు?
చౌహాన్‌: నిజమే… సన్నబియ్యం పదకం అమలులో కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైస్‌మిల్లర్లే. వారు బాగుంటేనే ఈ పదకం అమలు ఇంకా గొప్పగా సాగుతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
కట్టా: మిల్లర్లు మీ దగ్గరకు రాలేకపోతున్నారట? వారి సమస్యలు చెప్పుకుంటారట?
చౌహన్‌: తప్పకుండా…రాష్ట్రంలోని ఏ మిల్లరైనా సరే నా వద్దకు రావొచ్చు. వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకు నేను ఎప్పుడూ సిద్దంగా వుంటాను. ఎలాంటి అపోహలు వద్దు. ఇంత పెద్ద సన్నబియ్యం కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలంటే ప్రతి మిల్లర్‌ కూడా ఎంతో ముఖ్యమే. అందులో చిన్నా పెద్దా అనే తేడాలేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మాకు చెప్పొచ్చు. మీ వద్దకు వచ్చి, సమస్యలు చెప్పిన మిల్లర్‌ను నా వద్దకు పంపించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పాయింట్‌ మెంటు ఇస్తాను. వారి సమయం కేటాయించడంలో ఎలాంటి జాప్యం వుండదు. తెలంగాణ ఆహార భద్రతలో నెంబర్‌ వన్‌గా వుందంటే అందులో మిల్లర్ల పాత్ర కూడా వుంది. అలాంటి మిల్లర్లను నిర్లక్ష్యం చేయడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. మిల్లర్లు ఒక్కరొస్తారా? లేక కొంతమంది కలిసి వస్తారా? అన్నది వారి ఇష్టం. నేను ఎప్పుడైనా వారికి అందుబాటులో వుంటాను.
కట్టా రాఘవేంద్రరావు: ధన్యవాదాలు సార్‌. మళ్లీ కలుద్దాం.
దేవేంద్ర సింగ్‌ చౌహన్‌: ధాంక్స్‌..ఆల్వేస్‌ వెల్‌కం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!