
# పార్లమెంట్ ఎన్నికల కాగానే మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..
# సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే..
# తెలంగాణ ఉద్యమ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఖానాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి :
క్వింటాల్ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోనే మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు వ్యతిరేకి.. తెలంగాణ రైతుల పట్ల పచ్చి మోసగాడు అని రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్ తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని తెలుపుతూ వారు హామీ ఇచ్చిన వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలని
అందుకు నిరసనగా గురువారం నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండల కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ
సన్నరకం వడ్లతో పాటు దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటాల్ కు 500 బోనస్ అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనడం, దొడ్డు రకం, ఇతర పంటలకు ఇవ్వను అని మాట మార్చడం రైతులను మోసం చేసినట్లే అని అన్నారు.ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని పేజీ నెంబర్ 8లో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 బోనస్ అదనంగా ఇస్తామని చాలా స్పష్టంగా ఉందన్నారు.
– కానీ ఇప్పుడు ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చి, మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మాట మారుస్తున్నారని కాబట్టి రైతుల్లో చైతన్యం రావాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. బుద్దిలేని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కానీ వార్త పత్రికల్లో మాత్రం అన్ని హామీలు నెరవేర్చామని వార్తలు రాయించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడున్న మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము ఉన్నదా..?
అని ప్రశ్నించారు.కాంగ్రెస్ బోనస్ అనేది ఒక బోగస్… అని కేవలం సన్నాలకే బోనస్ ఇస్తామన్నారు. అసలు సన్నాలు పరి పంటలో ధాన్యం ఎంత శాతం పండిస్తారో కాంగ్రెస్ నాయకులకు ఏమన్నా సోయి ఉందా అని అడిగారు.రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా ప్రకటిస్తది.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందా.. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు.
ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతోనే ఉన్నారని, రైతుబంధు, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రేస్ పార్టీ మోసం చేస్తున్నది అని ఈ కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపిపిలు వేములపల్లి ప్రకాష్ రావు, జెడ్పిటిసిలు, ఛైర్మన్లు, ఎంపిటిసిలు, అర్ఎస్ఎస్ కన్వీనర్లు, తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ గ్రంధాలయ శాఖ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్ గారు,క్లస్టర్ భాద్యులు, గ్రామ పార్టీ భాద్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.