https://epaper.netidhatri.com/
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే.
`ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్.
`ఇప్పటికే ప్రచారంలో ముందంజ!
`అటు కేటిఆర్… ఇటు హరీష్ రావు.
`మూడు నెలలుగా విసృత ప్రచారం.
`అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే.
`త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రచారం ప్రారంభం.
`ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ అంటే ఒక బ్రాండ్. ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే ఒక స్ట్రాంగ్ లీడర్. తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్మాణాత్మకమైన నాయకుడు. తెలంగాణ కోసం ఉద్యమం నిర్మాణం చేశాడు. పద్నాలుగేళ్ల పాటు నిరంతరం పోరాటం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడగట్టారు. నాయకుల చేత సంతకాలు చేయించారు. ఏ ఒక్కరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ప్రజల గోస గురించి వివరించారు. అంతిమంగా తెలంగాణ తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తలరాతే మర్చేసిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ వస్తే ఇంత అభివృద్ధి సాధ్యమైందా? అని ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో చూడిరడి..అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతుంటే ఎవరూ నమ్మలేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే నిత్యం కరంటు కోతులువుండేవి. వ్యాపారం రంగం మొత్తం కుదేలైపోయింది. ఒక దశలో నగర పరిసరాల్లో వున్న పరిశ్రమలన్నీ తరలిపోతాయా? అన్న అనుమానం కలిగిన రోజులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం కరంటు కావాలంటూ ఇందిరాపార్క్ దగ్గర పారిశ్రామిక వేత్తలంతా ధర్నాలు చేసిన రోజలున్నాయి. కొన్ని తరలిపోయిన పరిశ్రమలు కూడా వున్నాయి. కాని నేడు ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ చూస్తున్నాయి. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. జిఎస్టీ పేరుతో దేశంలో అనేక పరిశ్రమల మూతకు కేంద్ర ప్రభుత్వం కారణమైతే, తెలంగాణలో అధ్భుతమైన పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కారణమయ్యారు. అంటే ఎవరు గొప్ప నాయకుడు ప్రజలే అర్ధం చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఐటి, నగరం చుట్టూ ఫార్మా రంగం విస్తరించిన తీరును దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌నుంచి పెద్దఎత్తున యువత ఉపాధి పనుల కోసం, చదువకున్న వాళ్లు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. కాని నేడు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తెలంగాణకు ఏటా లక్షలాది మంది వస్తున్నారు. తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి, అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. తెలంగాణలో వ్యవసాయ పనులు చేసేందుకు మహరాష్ట్ర, కర్నాకటలనుంచే కాకుండా బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లనుంచి యువత వస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్లులలో పనులు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందని వ్యక్తులు పనిచేసి, ఉపాధి పొందారంటే తెలంగాణ ఎలా నీడనిచ్చే, బతుకునిచ్చే చెట్టుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు వలసల తెలంగాణను నేడు ఉపాధి తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కింది. కేసిఆర్ లాంటి నాయకుడు యుగానికొక్కడే కనిపిస్తాడు అంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న హైదరాబాద్ అభివృద్ధి విశేషాలు…ఆయన మాటల్లోనే..
మొత్తం తెలంగాణ గురించి చెప్పుకున్నా, ఒక్క హైదరాబాద్ గురించి చెప్పుకున్నా ఇక్కడ జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సెక్రెటరియేట్ వద్ద వున్న ఫ్లైవోర్ ఉమ్మడి రాష్ట్రంలో 13 సంవత్సరాలు గడిస్తే తప్ప పూర్తి చేయలేదు. ఇలా అప్పట్లో అక్కడక్కడ నిర్మాణం చేసిన నాలుగు ఫ్లైవోర్లు పదిహేనేళ్లపాటు సాగాయి. కాని తెలంగాణలో దేశంలోనే భృహత్తరమైన, బహుళార్ధక ప్రాజెక్టును మించిన నిర్మాణం కాళేశ్వరం కేవలం మూడు సంవత్సరాలలో నిర్మాణం జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల కళ్లముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక్క ఫ్లైఓవరే పదమూడు సంవత్సరాలకు గాని పూర్తి కాలేదు. అంతే కాదు హైదరాబాద్‌లోని మెట్రో రైల్ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనా, తొమ్మిదేళ్లపాటు నత్తనకడన సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ జోక్యంతో చకచకా పూర్తయి ప్రజలకు సేవలందిస్తోంది. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్పదనం. హైదరాబాద్‌లో తొంబైవదశకం నుంచి తెలంగాణ వచ్చే దాకా పట్టుమని పది ప్లైఓవర్లు కూడా నిర్మాణం చేయలేదు. ట్రాపిక్ సమస్యను గాలికొదిలేశారు. హైదారాబాద్ అభివృద్దిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పం, మంత్రి కేటిఆర్ పట్టుదలకు నిదర్శనంగా 37 ప్లైఓవర్లు కేవలం తొమ్మిదేళ్లలో పూర్తి చేసి, నగరంలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తొలగించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రయాణం ఒక నరకం. కాని నేడు ఎంతో సులభం. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటి విద్యానగర్ చేరాలంటే మూడు కిలోమీటర్ల దూరం కనీసం గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసిన ఫ్లైఓవర్ మూలంగా ఐదు నిమిషాలలో ఎలాంటి ఆటకంకం లేకుండా వెళ్తున్నారు. ఇక మాదాపూర్‌లో ట్రాపిక్ సమస్య కోసం కొత్త చెరువు మీద వేలాడే వంతెన ఏర్పాటు చేసి, నగరాన్ని అందంగా ముస్తాబు చేయడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ, ఎన్నెన్నో విజయాలు వున్నాయి. ఒకప్పుడు ఎల్బినగర్ లో ట్రాఫిక్ కష్టాలు కథకథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు స్టీల్ వంతెన నిర్మాణం ఏర్పాటు చేసి, ఆ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించడం జరిగింది. దేశంలోనే తొలిసారి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మంత్రి కేటిఆర్‌కే దక్కుతుంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో నగరం విస్తరించిన తీరును చూసి ఎవరైనా అబ్బురపడాల్సిందే. ఒకప్పుడు కూకట్ పల్లి దాటితే నగర శివారు అనే పరిస్ధితి వుండేది. ఇప్పుడు చందానగర్ ప్రాంతం మరో నగరాన్ని తలపించేంత గొప్పగా ఆవిషృతమైంది. తెలంగాణ రాకముందు ఐటి సెక్టార్ అనేది కొంత వరకు మాత్రమే పరిమితమై వుండేది. తెలంగాణకుముందు ఐటి ఎగుమతులు కేవలం 50వేలకోట్లు. కాని ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలోనే రెండో స్ధానంలో నిలిచింది. త్వరలో మొదటి స్ధానానికి చేరుకుంటుంది. హైదరాబాద్ నగరంలో మంచినీటి కటకట అంటే తెలియని వాళ్లు లేరు. వారంలో రెండు రోజుల పాటు వచ్చే మంచినీటి సమస్యతో ప్రజలు ఎంతో సతమతమైన పరిస్దితి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నీటికి కూడా మీటర్ పెట్టి మరీ బిల్లులు వసూలు చేసిన రోజులు. అప్పార్టుమెంట్లు నిత్యం వాటర్ ట్యాంకర్లు కొంటేగాని పూట గడవని పరిస్దితి. మరి ఇప్పుడు నిత్యం మంచినీరు అందుబాటులోకి తేవడం జరిగింది.
ఈ తొమ్మిదేళ్లలోచెప్పుకోవడానికి కొన్నివందల అభివృద్ధి పనులు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. వందల సంక్షేమపథకాలు అమలులో వున్నాయి. మరి బిజేపి ఏం చెప్పుకుంటుంది? దేశం బైట వున్న నల్లధనం తెస్తామని తెచ్చిందా? నోట్లరద్దుతో దేశాన్నిమొత్తం రోడ్ల మీద నిలబెట్టింది. జిఎస్టీతో పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసింది. ధరలు పెంచింది. సామాన్యుల నడ్డి విరిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లకాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా నిర్మాణం చేసిందా? పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు దారాధత్తం చేసింది. వారికి రుణమాఫీలు చేసింది. కాని సామాన్యులకు ఏం చేసింది. అందుకే ప్రజలు ప్రతిపక్ష పార్టీలను పట్టించుకునే పరిస్ధితి లేదు. అంతే కాదు త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ దేశమే అబ్బురపడేంత గొప్ప పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రచారం మొదలు పెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయం మరొక లెక్క..అంతే… బిఆర్ఎస్కు తిరుగులేదు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపును ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రజల గుండెల్లో వున్నదే మేము..! మేం చేసిన అభివృద్ది పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. బిఆర్ఎస్ 90స్ధానాలు గెవడం పక్కా!