
`అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటైంది.
`నాయకులను చేసిన పార్టీలకు నమ్మక ద్రోహం నేర్చుకున్నారు.
`గెలిచే దాక ఒక పార్టీ, గెలిచిన తర్వాత అధికారం గూటికి
`ప్రజా తీర్పును అవమానిస్తున్నారు.
`ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బ తీస్తున్నారు.
`రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునేలా చేస్తున్నారు.
`గెలిచినా అధికారం పంచన చేరాలనుకుంటున్నారు.
`ఓడినా అధికారం నీడ కోరుకుంటున్నారు.
`పదవులిచ్చిన పార్టీకి అన్యాయం చేస్తున్నారు.
`తమను పట్టించుకోవడం లేదని సాకులు చెబుతున్నారు.
`పార్టీలు మారి అదృష్టం కొద్దీ పదవులు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.
`తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు.
`చరిత్ర హీనులుగా మిగిలేందుకు పోటీ పడుతున్నారు.
`పార్టీ గాలిలో గెలిచిన వాళ్లు కూడా బలవంతులనుకుంటున్నారు.
`ఓడిపోయి తమ తప్పేం లేదని ఆత్మ వంచన చేసుకుంటున్నారు.
`పార్టీలు మారడం ఎంత తప్పో ఈటెల రాజేందర్ లాంటి వాళ్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు.
`తెలిసి తెలిసి తమ రాజకీయ గోతిని వాళ్లే తవ్వుకుంటున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి: తన బలమేమిటో తెలుసుకోలేని వాడు నాయకుడే కాదు. తన బలహీనత తెలిసుకోకపోతే నాయకుడుగా ఎదగలేడు. ఇది రాజకీయాల్లో మూల సిద్దాంతం. ప్రతి నాయకుడు తనే బలవంతుడు అనుకోకపోతే రాణించలేడు. ప్రతి నాయకుడు వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న తపన బలంగా లేకపోతే ముందుకు వెళ్లలేడు. అయితే కొన్ని సార్లు పరిస్ధితులు అనుకూలించొచ్చు. అనుకూలించకపోవచ్చు. కాలం కలిసి వచ్చే వరకు ఎదురుచూసే వారే నిజమైన నాయకుడు. కొన్ని సార్లు కాలానికి ఎదురు వెళ్తే గాని భవిష్యత్తు చూడలేని వాళ్లు కూడా కొందరుంటారు. అదంతా ఆ సమయంలో తీసుకునే నిర్ణయం మీదనే ఆదారపడి వుంటుంది. అంతే తప్ప నాయకుడి మీద కాదు. ఈ విషయాన్ని ప్రతి నాయకుడు తప్పకుండా తెలుసుకోవాలి. కాని ఎవరికి వారు మరీ అతి విశ్వాసంతో వుంటున్నారు. కాని తమ పార్టీ వల్లనే ఓ స్ధాయికి ఎదిగామన్న సంగతి మర్చిపోతున్నారు. అందుకు నాయకులు తమకు ప్రాదాన్యత దక్కడం లేదనో, పదవులు రావడం లేదనో, గెలిచిన పార్టీలలో చాలా మంది వుండడం లేదు. ఇది దేశ వ్యాప్తంగా ఓ వైరస్‌గా మారిపోతోంది. పార్టీలు మారడం కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ అదికారం వుంటే అక్కడ వాలిపోతున్నారు. అదికారంలోలేకపోలే బతకలేమన్నంతగా తమ వ్యవహార శైలిని మార్చకుంటున్నారు. ప్రతిపక్షంలో వుండడానికి ఏ నాయకుడు సిద్దపడడం లేదు. అదికారం చెలాయించడం అలవాటు చేసుకున్నారు. ప్రతిపక్షంలో వుండాలంటే నిత్యం ప్రజలతోవుండాలి. ప్రజల కోసం కొట్లాడాలి. ఉద్యమాలు చేయాలి. కేసులు ఎదుర్కొవాలి. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ వుండాలి. వచ్చిన ప్రతి వారిని ఆదరిస్తూ వుండాలి. అదికారంవున్నప్పుడు వున్న దర్పం లేకపోతే కూడా నాయకులు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో వుంటే పనులు రావడం లేదు. పైసలు అందడం లేదు. ఖర్చులకు సరిపోవడం లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును సంపాదించుకోవాలంటే ప్రతిపక్షంలో సాధ్యం కాదు. ఐదేళ్లపాటు ప్రజల కోసం పోరాటం చేసే ఓపికలేదు. ప్రభుత్వంతో తలబడే శక్తి లేదు. ఏటికి ఎదురీదడం కాన్న, సాఫీగా సాగితే చాలు. ఈ గొడవలు, ఇబ్బందులు,సమస్యల వలయం కన్నా, హాయిగా అధికార పార్టీలో వుంటే ఎలాంటి తలనొప్పి వుండదు. ఇదీ ఇప్పటి ఎమ్మెల్యేల ఆలోచన. అది ఏ పార్టీలో వున్నా ఇదే ఆలోచన. ఇంతకు మించి ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కరువౌతున్నాడు. పార్టీ మారడానికి ఓ సాకు పెట్టుపెట్టుకుంటున్నారు. అభివృద్ది పేరిట పార్టీ మారుతున్నాను. నా ప్రజల సంక్షేమం కోసం కండువా మార్చుకుంటున్నాను. పార్టీ మారడమనే పెద్ద తప్పును, చిన్న మాటతో వదిలించుకుంటున్నారు. చేరబోయే పార్టీని పొడుగుతున్నారు. వీడుతున్న పార్టీలో తనకు న్యాయం జరగలేదంటారు. గుర్తింపు లేదంటారు? పార్టీలో గుర్తింపు లేకుండానే రెండు మూడుసార్లు గెలిచిన సంగతి మర్చిపోతారు. పార్టీలు మారడం అనేది చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పార్టీలు మారి బాగుపడినా అది తాత్కాలికమే. కొంత కాలమే..రాజకీయాల్లో ఏ పార్టీ శాశ్వతం కాదు. అధికారం అంతకన్నా శాశ్వతం కాదు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు మారుతున్నారు. నాయకులను చేసిన పార్టీలకు నమ్మకం ద్రోహం చేస్తున్నారు. అలా పార్టీలను నిండా ముంచిన వారు చాలా మంది వున్నారు. మళ్లీ తిరిగి , చివరి దశలో అదే పార్టీకి చేరిన వాళ్లు కూడాచాలా మంది వున్నారు. అప్పుడు పుట్టింటికి వచ్చామని మళ్లీ బడాయిలు పోతారు. తమ నాలుకను ఎటు వైపైనా తీప్పే నాయకులు చాలా మంది తయారౌతున్నారు. టికెట్ ఇచ్చేదాకా, గెలిచే దాక ఒక పార్టీ. ఆ పార్టీ గెలిస్తే చాలు. పొరపాటున ఆ పార్టీ ఓడిపోతే ఇక అంతే.. ఎప్పుడు అధికార పార్టీలోకి వెళ్దామా అని ఎదురుచూస్తుంటారు. ఈసారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే పది మందిఎమ్మెల్యేలు కారు దిగి, చెయ్యందుకున్నారంటే నాయకులు ఎంత అనైతకను ప్రదర్శిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలా పార్టీలు మారిన వారిలో సీనియర్లు కూడా వుండడం విడ్డూరం. సీనియర్ ఎమ్మెల్యే అయినా సరే దానం 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వెంటనే ఆయన తెలుగుదేశంపార్టీలో చేరారు. రాత్రికి రాత్రి టికెట్ తెచ్చుకున్నారు. టిడిపి నుంచి గెలిచారు. కాని ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆయన టిడిపికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోకి మళ్లీ వెళ్లారు. ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనుంచిగెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ముందస్తు ఎన్నికలు 2018 ముందు బిఆర్ఎస్లో చేరారు. గెలిచారు. 2023లో కూడా కారుపార్టీ మీద గెలిచారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే జెండా మార్చారు. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలా పార్టీలు మారుడం అలవాటున్న నాయకులను కూడా రాజకీయ పార్టీలు ఆదరించకూడదు. ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే, రాహుల్ గాందీ అయినా సరే పార్టీల వల్లనే నాయకులౌతారు. ఆ సంగతి తెలిసినా కొన్ని సార్లు నాయకులు తమ బలం వేరు అనుకుంటారు. కేసిఆర్ విషయానికి వస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని బైటకు వచ్చి రాజకీయ పార్టీ పెడితే ఎదిగేవారు కాదు. కాని ఆయన బైటకు వచ్చి తెలంగాన గళం ఎత్తుకున్నారు. తనకు జరిగిన అన్యాయం తెలంగాణకు జరిగిన మోసంగా చిత్రీకరించగలిగారు. అందుకే కేసిఆర్ నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీ స్దాపకుడు ఎన్టీఆర్కూడ అంతే. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటులో తెలుగు జాతి ఆత్మగౌరవం తెరమీదకు తెచ్చాడు. లేకుంటే ఆయన కూడా గెలిచేవారు కాదు. పార్టీ స్ధాపించేవారు కాదు. అలా కొన్నిసార్లు ఇతర నాయకులు బాటను ఎంచుకొని కనుమరుగైన నాయకులు కూడా వున్నారు. తెలంగాణలో తేదేపా నుంచి బైటకు వచ్చిన నవ తెలంగాణ అని పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్ అడ్రస్ లేకుండా పోయారు. తెలుగుదేశం నీడలో వున్నప్పుడు ఆయన నెంబర్ టూగా వెలుగొందారు. అదంతా పార్టీ పుణ్యమని మర్చిపోయారు. తాను బలవంతుడిననుకున్నారు. పార్టీలు మారడంలో కూడా కొన్ని సమయం, సందర్బాలు కూడా వుంటాయి. అవి కలిసి వస్తే నాయకులకు మరింత కాలం పదవులు కలిసి వస్తాయి. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇ ంద్రారెడ్డి లాంటి వారికి కలిసివచ్చింది. అది వారి అదృష్టమే కాదు, పార్టీకి అనువైన కాలం కావడం తో రెండు విధాల మేలు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుదేశం పార్టీ ఉనికి కష్టమనే విషయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ పసిగట్టారు. పార్టీ మారారు. అప్పుడు ఆ పార్టీలో వున్నా, ఇప్పుడు ఆ పార్టీలో వున్నా అదే నిబద్దతతో పని చేస్తున్నారు. పదవుల కోసం పార్టీలు మారినట్లు విమర్శలు ఎదుర్కొన్నా, పార్టీలో మంచి గౌరవం పొందుతున్నారు. తెలుగుదేశంలో ఎంత దూకుడుగా వుండేవారో, ఇప్పుడు అంత పరిణతి పొందిననాయకుడుగా వుంటున్నారు. సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మారి బిఆర్ఎస్లోకి మారారు. తన గౌరవాన్ని తాను కాపాడుకుంటున్నారు. అలా గౌరవంగా వుంటున్న వారు కొందరున్నారు. కాని ఏ ఎండకాగొడుగు పట్టాలనుకుంటే చాల సార్లుకాలం కలిసి రాకపోవచ్చు. అందుకు సొంత పార్టీని ఎదిరించిన మేనకా గాందీ పరిస్దితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో వచ్చే తరానికి మరో ఇందిరాగాంధీ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇందిరాగాందీకి ప్రభుత్వంలో, పార్టీలో ఆమె చూపిస్తున్న చొరవ అందర్నీ ఆకర్షించింది. పైగా ఎమర్జెన్సీ సమయంలో తన భర్తకు, అత్త ఇందిరాగాందీకి ఆమె తోడుగా నిలిచారు. పార్టీని కాపాడుకోవడంలో ఎంతో కృషి చేశారు. కాని ఆమె భర్త సంజయ్‌గాంధీ మరణంతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించారు. ఒక రకంగా అపోహపడ్డారు. అత్తతో విబేదాలు కొని తెచ్చుకున్నారు. అత్తనుంచి దూరం జరిగి, రాష్ట్ర సంజయ్ మంచ్ అనే పార్టీని ఏర్పాటు చేసి బొక్క బోర్లా పడ్డారు. ఆమె ఆనాడు పార్టీ మారకపోయి వుంటే, ఇప్పుడు సోనియాగాందీ స్ధానంలో ఆమె కాంగ్రెస్‌ను నడిపించేవారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు నాయకుల జీవితాలను తలకిందులు చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.