
"Protests Against New Electricity Act"
ప్రజలపై భారాలు పెంచడానికే కేంద్ర విద్యుత్తు చట్టం
బషీర్ బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకరించి ప్రజలపై భారాలు మోపేందుకే నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజా వ్యతిరేక నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని స్థానిక ఓంకార్ భవన్ లో విద్యుత్ పోరాట అమరవీరులు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ ల 25వ వర్ధంతి కార్యక్రమాన్ని డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం పెద్దారపు రమేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్తురంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చి నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లు ప్రవేశపెట్టిందని ఈ క్రమంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.తమ ఇష్టానుసారంగా కరెంటు చార్జీలను పెంచేందుకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి కనీస చలనం కలగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడి డిస్కాం లుగా విడగొట్టి ప్రైవేటీకరించేందుకు పూనుకుంటే వామపక్ష పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినారని ఈ క్రమంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తే లక్షలాదిమంది పోరాటంలో పాల్గొన్నారని అప్పటి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి లాఠీలను తూటాలను తుపాకులను ఉపయోగించి రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి ప్రాణాలను బలి కొన్నారని వందలాది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.ఆ విద్యుత్ పోరాట ఫలితంగా అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు విద్యుత్ చార్జీల జోలికి రాలేదని అదే గుణపాఠం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పదని ఇప్పటికైనా కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు, వంగల రాధసుద,జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు కర్నే సాంబయ్య, భైరబోయిన నరసయ్య, గడ్డం స్వరూప, గుర్రం రవి,గణిపాక బిందు, కందికొండ సాంబయ్య,అజయ్,విజయ, లక్ష్మి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.