ktr jubliee hills election
`జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆరే కీలకం
`కాంగ్రెస్, బిజేపిలకు దక్కని క్రేజ్ కేటీఆర్ సొంతం

`అన్ని రకాల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్
`అటు మీడియా సమావేశాలు.ఇటు పార్టీలో చేరికలు
`హైదరాబాదులో ప్రభుత్వ బాదితులతో సమావేశాలు
`సమయం చూసి హైడ్రాను ఉతుకుడు ఉతుకుతున్నాడు
`విస్మరించిన ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తున్నాడు
`బాకీ కార్డులిచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు
`అండగా వుంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు
`ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు
`అన్ని డిజిజన్లలో పెద్ద ఎత్తున రోడ్ షోలు
`గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు
`సీఎం. ‘‘రేవంత్ రెడ్డి’’కి కూడా కనిపించని క్రేజ్ ‘‘కేటీఆర్’’ సొంతం చేసుకున్నాడు
`కాంగ్రెస్ సభలకు రెట్టింపు జనాలు కేటిఆర్ సభలకు హజరౌతున్నారు
`‘‘కేటీఆర్’’ రోడ్‌షోలకు ప్రభంజనంలా తరలివస్తున్న జనం
`2015 జిహెచ్ఎంసి ఎన్నికలకు మించి సక్సెస్ అవుతున్న రోడ్‌షోలు
`పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు
`ఒంటి చేత్తో పార్టీ స్టీరింగ్ పట్డుకొని కారు జోరు పెంచుతున్నాడు
`సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నాడు
`క్షణం తీరిక లేకుండా ‘‘జూబ్లీ హిల్స్’’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు
`ప్రభుత్వం మీద పదునైన విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు
`అధికార పార్టీ కాంగ్రెస్‌ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు
`ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు
`‘‘కేటీఆర్’’ సభలు, రోడ్ షోలు జనంతో కళకళలాడుతున్నాయి
`‘‘కేటీఆర్’’ జిందాబాద్ నినాదాలతో సభలు మారుమ్రోగిపోతున్నాయి
`పిల్లలు సైతం ‘‘దేక్లేంగే’’ అని పాటలు పాడుతున్నారు
`’’కేటీఆర్’’ అంకుల్ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు
హైదరాబాద్, నేటిధాత్రి:
తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ పంచ్ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్ క్రేజ్ అంటూ బి ఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్ కార్నర్ సభల్లో, కేటిఆర్ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్ వేస్తున్న పంచ్ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్ఎస్ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ సెంటఆర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరుపున అసలైన స్టార్ క్యాంపెయిన్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్ నగర్లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్ బంద్ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్ కార్డులు కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్ షోలలో కార్నర్ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్ కార్నర్ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్ఎస్లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్ఎస్ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్ వెహికిల్ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్ లీడర్ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.
