మద్దతు ధర పెంపులో కేంద్రం మోసం
స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి: రైతు సంఘం
నర్సంపేట, నేటిధాత్రి:
రైతుల పంటలకు కనీస మద్దతు ధరలు పెంపులో కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సూచించిన సి2+50 శాతం విధానం ప్రకారం ధరలు నిర్ణయించకుండా, ఎ2+కుటుంబ శ్రమ విలువ ఆధారంగానే ధరలు ప్రకటిస్తున్నారని విమర్శించారు.నర్సంపేటలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, కందులు, మినుములు, పత్తి, నువ్వులు తదితర పంటలకు ప్రకటించిన ధరలకు, రావాల్సిన ధరలకు భారీ తేడా ఉందన్నారు. పెరుగుతున్న విత్తనాలు, ఎరువులు, డీజిల్, కూలీల ఖర్చులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధ హామీ కల్పించాలని, అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా, ఈసంపెళ్లి బాబు,
ఉపాధ్యక్షులు కోరబోయిన కుమారస్వామి, చల్ల నర్సింహారెడ్డి, అన్వర్, ఇస్లావత్ నెహ్రు, అక్కేపల్లి సుధాకర్, చల్ల మల్లయ్య, గోనె మల్లారెడ్డి, కోడెం రమేష్, లక్క రాజు పాల్గొన్నారు.
