సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత అవసరం

హైదరాబాద్‌,నేటిధాత్రి:
బాధకు మించిన గొప్ప గురువు లేడు. మన హృదయం తగినంత విశాలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల హృదయాన్ని కలిచివేసే బాధను అర్థం చేసుకోగలం. కేవలం నేమ్‌ అండ్‌ ఫేమ్‌ అనే చట్రంలో చిక్కుకొని అందులోనుంచి బయటకు రాలేనివారు మాత్రమే తమ కారణంగా ఇ తరులు కష్టాలపాలైనా పట్టించుకోలేరు. ఎందుకంటే ‘కీర్తి, ప్రతిష్ట, డబ్బు’ అనే మూడు సంకెళ్ల వల్ల కలిగే అహంకారం అడుగుముందుకేయనీయదు. తన వల్ల జరుగుతున్న తీవ్ర నష్టాన్ని కూ డా పట్టించుకోనీయదు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో ఎం.ఐ.ఎం. సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ, పుష్ప`2 సినిమా విడుదల సందర్భంగా ఒక ప్రముఖ హీరో రాకతో ఒక థియేటర్‌లో ఏర్పడిన తొక్కిసలాట, ఒక మహిళ ప్రాణం పోవడం, పిల్లవాడు ఇప్పటికీ బ్రైన్‌ డెడ్‌ కండిషన్‌లో కోమాలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ ఇచ్చిన
ఉ ద్వేగపూరిత సమాధానం హృదయాలను ద్రవింపజేసేదిగావుంది. నిజంగా ఆయన చెప్పిన మాటలు అక్షరసత్యం.
ఏదైనా ఒక రంగంలో ప్రముఖ స్థానానికి ఎదిగినవారు, ప్రజాకర్షణ కలిగిన వారు తాము బహి రంగ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఇది తమకు మాత్రమేకాదు వెర్రి అభిమానంతో వచ్చే ప్రజల క్షేమం గురించి కూడా! తమకు బాధ కలిగినా లేక కష్టం కలిగినా ఎంతోమంది తమవెనుక వున్నారన్న ధీమా, డబ్బు వున్నదన్న అహంకారం, అధికారంలో వున్నవారి అండవున్నదన్న వెరపులేని తనం అనర్థాలకు తావిస్తుందన్నదానికి సంధ్య థియేటర్‌ సంఘటన గొప్ప ఉదాహరణ. ఇక్కడ సదరు హీరో చాలా సంవత్సరాలుగా థియేటర్‌కు సిని మాలు చూడటానికి కుటుంబంతో సహా వస్తుండవచ్చు. దాన్నెవరూ కాదనరు. అంతపెద్ద జనం ఒక్కసారిగా ఒకే దారి వున్నట్టుగా చెబుతున్న థియేటర్‌ వద్దకు చేరుకున్నప్పుడు కచ్చితంగా తొక్కిసలాట జరిగి తీరుతుంది. ముఖ్యమంత్రి వివరించిన ప్రకారం పోలీసులు కూడా తాము రక్షణ కల్పించలేమని, చెప్పినప్పటికీ థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం, సినీ హీరో ‘అతి’ వెరసి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. నిజం చెప్పాలంటే సెల బ్రిటీలుగా తమను తాము చెప్పుకునేవారు ఎవరైనా సామాజిక బాధ్యతను విస్మరించడానికి వీల్లేదు. పరిస్థితులు చెయ్యిదాటిపోయే స్థితి వున్నప్పుడు అటువంటివారు ఇల్లు దాటి రాకుండా వుంటేనే మంచిది. ‘మేం కూడా మనుషులమే. మాకు కూడా ఉత్సాహం వుంటుంది కదా’ అని వాదించే వితండవాదులను వారి ఖర్మకు వారిని వదిలేయడాల్సిందే. తాము చేసిన పనికి తాము మాత్రమే ఫలితం అనుభవించేదిగా వుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ప్రముఖ హీరో వ్యవహారశైలి వల్ల తొ క్కిసలాట జరిగి, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఇంకా కోమాలోనే చికిత్స పొందుతున్నాడు. ఇందులో అతనికి ప్రత్యక్ష ప్రమేయం లేకపోవచ్చు. కానీ తొక్కిసలాట జరగడానికి కారణం ఆయన థియటేర్‌కు రావడం వల్లనేనన్నది మాత్రం నిజం. అన్నింటికంటే విషాద మేంటంటే భార్య మరణించి, కుమారుడు కోమాలో ఆసుపత్రిలో వుండి భరించలేని గుండెకోతతో బాధపడుతున్న ఆ తండ్రిని ఒక్కరు కూడా పరామర్శించకపోవడం క్షమించరాని తప్పు. థియేటర్‌లో జరిగిన సంఘటనకు ముఖ్యమంత్రి రేవంత్‌కు సంబంధం లేదు. కానీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నాడు కనుక అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు స్పందిం చారు. అదేవిధంగా ఆ హీరో, ఈ సంఘటనకు తనకు సంబంధం లేదని చెప్పడంలో సాంకేతికంగా నిజం వుండవచ్చు. కానీ సామాజిక, నైతిక బాధ్యత మాటేంటి?
సినీ ప్రపంచం నిజంగా రంగుల మాయా ప్రపంచమే! సదరు హీరో ఒక్కరాత్రి జైల్లో వున్నందుకే అంతా కట్టకట్టుకొని ఆయనపై పరమార్శల జల్లు కురిపించడానికి క్యూలు కట్టారే! ఒక్కరైనా తన కుమారుడి కోర్కెను తీర్చడం కోసం సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చి ప్రాణాలు కోల్పో యిన ఆ తల్లి, కోమాలో ఉన్న ఆమె తనయుడి గురించి ఒక్క సానుభూతి ప్రకటన అయినా చేశారా? ఇదే సదరు హీరోకు ఒక చిన్న దెబ్బ తగిలినా, చిన్న గాయమైనా ఇప్పటికి తెలుగు రాష్ట్రాలు మొత్తం గగ్గోలు పెట్టివుండేవి! లైవ్‌ టెలికాస్ట్‌లు, విమర్శలు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడాలు…ఒకటేమిటి… నానా యాగీ చేసివుండేవారు. అన్నింటికంటే విషాదమేంటంటే, ‘ఈ సంఘటనలో ఆ హీరో తప్పేమీ లేదని’ మృతురాలి భర్త ప్రకటన ఇవ్వడం. దీని వెనుక ఆయనపై ఎంతటి వత్తి డి వచ్చి వుంటుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాణం అనేది ఎవరిదైనా ఒక్కటే! నేమ్‌, ఫేమ్‌, డబ్బు వున్నవాడి ప్రాణం బంగారంలాగా, పేదవాడి ప్రాణం రాయిలాగా వుండదు! ఊపిరి విడిచిన తర్వాత ఎవరి కట్టెనైనా కాల్చి బూడిద చేయాల్సిందే! ఎ వ్వరూ కట్టుకుపోయేదేమీ వుండదు!
సినీ ప్రపంచంలో కూడా బాగా ఫేమ్‌ ఉన్నవారికి ఉన్న ట్రీట్‌మెంట్‌ మిగతావారికి వుండదు. త మకు ఇబ్బంది లేదనకుంటే ఎంతగా పట్టించుకోరో అవసరం వుంటుందనుకుంటే అంతలా బంకలాగా అంటుకుపోతారు. సదరు హీరో రావడం వల్ల ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుస్తున్నది కదా! ఒక కుటుంబం విచ్ఛినమైంది! భార్య చనిపోయి, కొడుకు ఆసుపత్రిలో వున్న ఆ తండ్రి బాధను ఎవరైనా పట్టించుకున్నారా? తాము అనుమతి ఇవ్వకపోయినా థియేటర్‌ యాజమాన్యం ఖాతరు చేయని తనానికి పోలీసులు ఇప్పుడు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి సరేసరి. అసెంబ్లీలో ఆయన ఏకంగా ఈ విషాదంపై సుదీర్ఘ ప్రసంగం రూపంలో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆకలి, బాధ, సంతోషం, విషాదం అనేది అందరు మానవులకు ఒక్కటే. కేవలం సినిమాలో గంభీరంగా నటించి ప్రేక్షకులను మెప్పించడం వల్ల అభిమానులు పెరగొచ్చు, డబ్బు దండిగా రావచ్చు. కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా! అయినా సినిమా తీసేది వ్యాపార దృక్పథంతో, స్వలాభాపేక్షతో తప్ప, ఇందులో సామాజిక బాధ్య త ఏముంటుంది? అటువంటప్పుడు మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం చేసుకునే వ్యాపా రంలో ప్రజలే కస్టమర్లు! మరి వారి ప్రాణాలకే మీ వ్యాపారం భద్రత కల్పించలేనప్పుడు, ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నది కదా! ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని, అందిస్తున్న సహకారాన్ని దృష్టిలో వుంచుకొని తమ పరిధిలో తమ వ్యాపారం చేసుకోవాలి తప్ప ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లజేసే విధంగా వ్యవహరించకూడదు! ఇది ఏ రంగానికి చెందిన ‘సెలబ్రిటీలు’గా తమను తాము గొప్పగా ఊహించుకునేవారు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!