CPI Calls to Make Centenary Celebrations a Grand Success
సిపిఐ వందేండ్ల పండుగను జయప్రదం చేయండి
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సంసిద్ధం కావాలి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
డిసెంబర్ 26కి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతుందని వంద సంవత్సరాల దినోత్సవం రోజు కరీంనగర్ నగరంలో పార్టీ జెండాలను ఆవిష్కరించి వందేళ్ల సిపిఐ త్యాగాలు విజయాలను, ప్రజలకు తెలియజేయాలని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిపిఐ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ కరీంనగర్ నగర కౌన్సిల్ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా జరిగిన పోరాటాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఘనమైన చరిత్ర ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ లేకపోతే తమకు ఎవరు పోటీ ఉండరనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పోరాట ఉద్యమ చరిత్ర వక్రీకరిస్తుందని ఆయన ఆరోపించారు. సిపిఐ పార్టీ పుట్టి వంద సంవత్సరాలయిందని ఇది దేశంలో పోరాటం చేసిన చరిత్ర ఏపార్టీకి లేదన్నారు. బిజెపి పాలకులు కాంగ్రెస్ కి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గొప్పగా చెప్పుకుంటుందని వల్లభాయ్ వల్లనే హైదరాబాద్ విలీనం అయ్యిందని చరిత్ర వక్రీకరిస్తుందని విమర్శించారు. మద్దు మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలిపిచ్చారని అప్పటికీ పదిలక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్రజలకు పంపిణీ చేశారని దీంతో హైదరాబాద్ కమ్యూనిస్టుల వసం అవుతుందనే భయంతోనే హైదరాబాదులో విలీనానికి ఒప్పందం జరిగిందని వారు గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట దేశంలో మారణహోమం సాగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కులు, జీవనోపాదులు, గౌరవ జీవితానికి ఉన్న హామీని అణిచి వేస్తుండడంపై రాజి లేని పోరాటం చేస్తామని ఆయన ఈసందర్బంగా తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటం నుంచి ఆతర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, ఉపాధి, గృహ సమస్యలపై విరోచిత పోరాటం చేసింది సిపిఐ అని దాని ఫలితంగానే అనేక చట్టాలను హక్కులను సాధించుకున్నామని అందుకే కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ వంద సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని అలా చేస్తే కమ్యూనిస్టులకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బ్యాంకుల జాతీయకరణ చేశారని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారని కానీ మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణ, కార్పొరేట్ ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం వ్యవసాయ కార్మికుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. కరీంనగర్ నగరంలో కమ్యూనిస్టు పార్టీకి కార్పొరేటర్ లేక పోయినప్పటికీ పేదల భూమి పంపిణీ చేపట్టిందని, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పించిందని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర సిపిఐకి కరీంనగర్ లో ఉందన్నారు. భవిష్యత్తులో సిపిఐ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని మతోన్మాద బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, చెంచల మురళి, కసి బోసుల సంతోష చారి, మాడిశెట్టి అరవింద్, సత్యనారాయణ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.
