బల్దియా కమిషనర్ తో దుష్ప్రవర్తన, పెరుమాండ్ల లక్ష్మణ్ పై కేసు నమోదు

నేటిధాత్రి, వరంగల్ జిడబ్ల్యూఎంసీ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ తో దుష్ప్రవర్తన చేసినందుకు పెరుమాండ్ల లక్ష్మణ్ పై కేసు నమోదు చేశారు మట్ట్వాడ పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యకుడుని అని, సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటున్న పెరుమండ్ల లక్ష్మణ్ అనే వ్యక్తి, అట్టి సంస్థ పేరు మీద కాగితంపై సొంతంగా వాళ్ళే రిజిస్టర్ అయినట్లుగా లెటర్ ప్యాడ్ సృష్టించుకోవడం జరిగిందని, వీరికి అధికారికంగా కలెక్టర్ నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, ఇతర ఉన్నతాధికారుల నుండి గాని, ఏలాంటి అనుమతులు లేవని, సదరు కమిటీ పైన చెలామణి అవుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నారని రెగ్యులర్ గా వీరిపైన ఫిర్యాదులు వస్తున్నాయని,
చెరువుల పరిధిలో గల ఎఫ్.టి.ఎల్, (బఫర్ జోన్) లోపల అమాయక ప్రజలను, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న యజమానులను బెదిరించి, పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతు మోసం చేస్తున్నారని తమ దృష్టికి రాత పూర్వకంగా పిర్యాదులు అందాయని, అలాగే సోమవారం గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా నగరంలోని రెండు చెరువుల్లో వ్యర్థాలు తొలగించాలని అధికారులను లక్ష్మణ్ కోరడం జరిగిందని, అట్టి అంశం పట్టణ ప్రగతి గ్రాంట్ కింద రాష్ట్ర పరిధిలో బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల కాంట్రాక్టర్ నుండి ఆలస్యం జరుగుతుందని తెలియజేయడం జరిగిందని, ఇట్టి సమస్యకు సత్వర పరిష్కారం చూపడానికి జిల్లా మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం వల్ల, నిధుల విడుదల సులభం అవుతుందని, తద్వారా వెంటనే పరిష్కారం జరుగుతుందని సూచించడం జరిగిందని, అందుకు ప్రతిస్పందనగా వారు మేమెందుకు అడగాలి?మీరెందుకు ఉన్నారు? అంటూ దురుసుగా ప్రవర్తించారు అని, ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు వరుస సంఖ్య ప్రకారం దరఖాస్తులు అందజేస్తుంటే, సదరు వ్యక్తులు అట్టి క్యూ ను నెట్టుకుంటూ వచ్చి దరఖాస్తుదారులకు ఇబ్బంది కలిగించారని, ఇదే తరహా ప్రవర్తనను గత ప్రజావాణి కార్యక్రమంలో కుడా పునరావృతం చేశారని,
ప్రజావాణి కార్యక్రమం అనునది ప్రజలందరికీ సమానమే అని, వ్యక్తిగత విషయాల ప్రస్తావన తెచ్చి ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం ఒక అలవాటుగా మారిందని, పెరుమండ్ల లక్ష్మణ్ అను అతను వచ్చి బల్దియా కమీషనర్ ను ఏకవచనంతో సంబోధించడం, ప్రభుత్వ విధులను ఆటంకపర్చారని, స్మార్ట్ సిటీ సంబంధ పనులపై ఫిర్యాదు చేస్తూ అందరి ముందు కొందరు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వీరందరూ అవినీతి పరులంటు పేర్కొనడమే కాకుండా, ఉద్యోగులందరూ అవినీతి పరులని పలుకుతూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఐపిసి 353 ప్రకారం ఎఫ్ఐఆర్ నెం.36/2024 నమోదు చేసినట్లు జిడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా నేడొక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!