ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు.. అసలు విషయమిదే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఈసీ నిబంధనలు అతిక్రమించారనే కారణంతో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారని పోలీసులు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఘర్షణలకి దిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు పాటించలేదని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మధురానగర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిన్న ఎన్నికల సందర్భంగా యూసఫ్‌గూడ పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్‌రెడ్డి హల్‌చల్ చేశారని పోలీసులు చెప్పుకొచ్చారు. పాడి కౌశిక్‌రెడ్డి తన అనుచరులతో కలిసి మహ్మద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. తాము వద్దని చెప్పినా ఆయన వినకుండా లోపలికి నెట్టుకెళ్లారని పోలీసులు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కారణంతో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ట్రేస్ పాసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశామని మధురానగర్ పోలీసులు పేర్కొన్నారు.
