
Case Against Jagan
జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.
జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.
గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.
కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.
దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.
కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.
ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…
జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.
మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.
అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..
వారికి నోటీసులు పంపిస్తున్నారు.
ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.
ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.
ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.
మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.