
"Precautions for Heavy Rains in Warangal"
భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి
భారీ వర్షాల పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు.ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు.తీవ్ర వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.లోతట్టు బ్ప్రాంతాల్లో జలమయం కు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా డ్యామ్లు, చెరువుల స్థితిగతులు నిరంతరం పరిశీలించాలని,ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి,ఇరిగేషన్ శాఖ ఈఈలు శంకర్,సునీత,జిల్లా ఆర్ అండ్ బి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కల్పన,జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి,ఉమారరాణి,తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.