బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.
డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నియమ నిబంధనలు పాటించని శ్రీ లక్ష్మీగణపతి స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎల్హెచ్ పిఎస్, డిబిడిఎస్ ప్రజాసంఘాలు,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన్నకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం డిబిడిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ,ఎల్హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్,ఎమ్మార్పీఎస్(టీ.ఎస్) జిల్లా అధ్యక్షులు మైసి శోభన్ మాదిగ ,ధరణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈదునూరి రమేష్ మాట్లాడుతూ నర్సంపేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ కాంట్రాక్టు నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా వారి యొక్క స్టాండ్ నడుపుచున్నారన్నారు సదర్ స్కూటర్ స్టాండ్ కు పొందిన అనుమతిలో ఒకవైపు మాత్రమే దారి కలదు కానీ ఆయా నిర్వహకులు పొందిన ఒకవైపు దారి కాకుండా మరో మూడు దారులను ఏర్పరచుకొని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ విధంగా అనుమతులను భేఖాతరు చేయడం వలన ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యానికి గురికావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా బస్సులు బయటకు వెళ్లే దారిని నిబంధనలకు విరుద్ధంగా స్కూటర్ స్టాండ్ కు వెళ్లే దారిగా ప్రధానంగా నిర్వాహకుడు ఉపయోగించడం వలన పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో ఆ కాంట్రాక్టు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున తక్షణమే విరుద్ధంగా ఉన్న దారులను మూసివేసి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రతపై పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లేని యెడల ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తడుగుల విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి రాష్ట్ర నేత, ఆరేపల్లి బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోట డేవిడ్ మార్గ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్,నేలమారి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.