మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి… టాప్ గేర్ వేసేసింది గులాబీ పార్టీ. ఓవైపు అసంతృప్తులను లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉండగానే… మరోవైపు ప్రచారాన్ని షురూ చేసేసింది.
కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేటీఆర్ కొన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండటం.. ఆ తర్వాత జమిలి ఎన్నికలపై ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చునన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా వేగం పెంచింది.
ఇద్దరు మంత్రులు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్, హరీశ్‌రావు విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందని.. వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారంటీలను ఎవరు నమ్ముతారని చురకటిస్తున్నారు. బీజేపీకు మతం తప్ప మరో అంశం తెలియదని మండిపడుతున్నారు.
ఇక టికెట్లు దక్కని నేతలకు హామీలు ఇస్తున్నారు గులాబీ పెద్దలు. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా… మరికొన్నింటిని కూడా భర్తీ చేయాలని చూస్తోంది గులాబీ దళం. ఇక ఇప్పుడు కుదరకపోతే మరోసారి అధికారంలోకి రాగానే అవకాశాలు ఇస్తామనే భరోసా కల్పిస్తున్నారు. విబేధాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరు నేతలు… మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే.. హ్యాట్రిక్ విక్టరీనే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.