-ప్రజలంతా కొత్త ‘‘కేసీఆర్’’ ను చూశారు
-చాలా కాలం తర్వాత ‘‘కేసీఆర్’’ ను చూసిన ఆనందంలో కేరింతలు కొట్టారు
-‘‘కేసీఆర్’’ ప్రసంగంలో ఉగ్రరూపం కన్నా, సమగ్ర రూపానికి విలువిచ్చారు
-శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేశారు
-తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అన్నారు
-కాంగ్రెస్ వైఫల్యాలను జనం చేత చెప్పించారు
-మొదటి సారి ప్రజలను ‘‘అన్నలు’’ అని పలుసార్లు సంబోధించారు
-తనదైన శైలికి భిన్నంగా కొత్త ‘‘కేసీఆర్’’ ను చూపించారు
-ఒక్కో పథకం ప్రస్తావిస్తూ చురకలు అంటించారు
–కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు
-తన కళ్ల ముందే తెలంగాణ తెర్లవుతుంటే తట్టుకోలేకపోతున్నాన్నారు
-మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీయే అని శ్రేణులలో భరోసా నింపారు
-ఏడాదిన్నర సమయం కాంగ్రెస్ కు ఇచ్చానన్నారు
-ఇక ఆగేది లేదంటూనే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్ధామన్నారు
-పనిలో పనిగా పోలీసు శాఖను హెచ్చరించారు
-బీఆర్‌ఎస్ సోషల్ మీడియాను ప్రశంసించారు
-స్వయంగా నేనే శ్రేణులకు అందుబాటులో వుంటానన్నారు
-సభ ఊహించినట్లే సక్సెస్ అయింది
-డ్రోన్ కళ్లకందనంత సభా ప్రాంగణం నిండిపోయింది
-నింగి వంగి నేల పొంగిందన్నట్లు జనం వచ్చారు
–నిర్వాహకులు ‘‘ఎమ్మెల్సీ పోచంపల్లి’’, ‘‘ఎమ్మెల్సీ తక్కల్లపల్లి’’ ‘‘పెద్ది’’,’’దాస్యం’’ లను అభినందించారు
-అశేష జనవాహిని చూసి కేసీఆర్ మురిసిపోయారు
-ఖమ్మం నుంచి అత్యధికంగా ప్రజలు తరలివచ్చారు
-రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు’’ అందరికన్నా ఎక్కువ మందితో సభకు వచ్చారు
హైదరాబాద్,నేటిధాత్రి:
బిఆర్‌ఎస్ రజతోత్సవ రోజున ప్రకృతి పరంగా కూడా ఒక అద్భుతం జరిగింది. ఇది ఎవరూ ఊహించలేదు. అసలు ఊహకుకూడా అందలేదు. మండు వేసవిలో 45 డిగ్రీల ఎండలో సభకు జనం ఎలా వస్తారో..ఎండలో సభలో ఎలా వుంటారో అని అందరూ అనుకున్నారు. నిప్పులు కక్కే ఎండలను తట్టుకొని వచ్చేదెంత మంది అని కూడా అనుకున్నారు. కాని బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వాతావరణం సహకరించడం అన్నది గొప్ప విషయం. విశేషం కూడా. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. మండు వేసవిలో తెలంగాణ మలయమారుతంలాగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా మారిపోయింది. సభ జరగడానికి ఒక రోజు ముందుకు కూడా నిప్పులు వేడిమి వుంది. సభ తెల్లారి కూడా మళ్లీ ఎండ విపరీతంగా కాసింది. సభ జరిగిన రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని వాతావరణం మాత్రమే వుంది. ఇదెలా సాధ్యమైందన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కేసిఆర్ సభ అంటే వాతావరణం కూడా ఎంత సహకరించిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు ఒక్కసారిగా ఒక్క పూట చల్లబడిన వాతావరణం సాయంత్రానికి వర్షం కురిస్తే కూడా ఇబ్బందే అయ్యేది. కాని అటు వాన లేదు. ఇటు ఎండ లేదు. చల్లదనం మాత్రమే కనిపించింది. బిఆర్‌ఎస్ సభ ఊహకందనంత విజయం సాధించింది. ప్రకృతి కూడా బిఆర్‌ఎస్‌కు రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినట్లైంది.
సింహ శ్వాసలో వేడి, గర్జనలో వాడి రెండు ఎలా వుంటాయో బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో అధినేత కేసిఆర్ ఏక కాలంలో చూపించారు. కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులుచెరిగారు. అదే సమయంలో బిఆర్‌ఎస్ పుట్టుక, తెలంగాణ ఉద్యమం, సాధనలను ఎంతో అర్ధవంతంగా వివరించారు. కేసిఆర్ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై ఏం మాట్లాడాలో కాంగ్రెస్‌పార్టీకి అర్ధం కాకుండాపోతోంది. నాయకులు తర్జన భర్జన అవుతున్నారు. లక్షలాది మంది సాక్షిగా కేసిఆర్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. పనిలోపనిగా ప్రజల చేత ఆ వైఫల్యాలను చెప్పించారు. దాంతో లక్షల మంది కాంగ్రెస్ పధకాలు అమలు కావడం లేదని చెప్పినట్లైంది. నిజానికి కేసిఆర్ తన శైలికి భిన్నంగా ఇలాంటి నినాదాలు చేయించారు. తాను మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్‌ను తూర్పారపట్టినట్లైంది. ఇక సభ విషయానికి వస్తే రజత్సోతవ సభలో సరికొత్త కేసిఆర్‌ను జనం చూశారు. ఒకప్పటి ఉద్యమ కేసిఆర్‌వేరు. ఇప్పుడుకేసిఆర్ వేరు. ఆ కేసిఆర్‌లో ఉరిమే ఉత్సాహం మాత్రమే కనిపించేంది. కాని ఇప్పుడు ఉప్పెనలాంటి కేసిఆర్‌ను జనం చూశారు. బిఆర్‌ఎస్ అధికారంలోవున్నా లేకున్నా, ప్రజల గుండెల్లో మాత్రం సుస్ధిరంగా వుందని నిరూపించారు. సహజంగా సభ నిర్వహణ అంటే బిఆర్‌ఎస్‌ను మించిన పార్టీలేదు. దేశంలోని ఏ పార్టీకి ఇంత పెద్దసభలు నిర్వహించడం సాధ్యం కాదు. అది ఒక్క కేసిఆర్‌కు మాత్రమే అని మరోసారి నిరూపించినట్లైంది. ఉద్యమ కాలంలో కొన్ని వందల సభలు కేసిఆర్ నిర్వహించారు. ఆ సభలకు కూడా ఎప్పుడూ లక్షకు తక్కువ కాకుండా ప్రజలు హజరయ్యేవారు. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న తెలగువాళ్లే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలకు టివిలకు అతుక్కుపోయేవారు. కేసిఆర్ ప్రసంగిస్తున్నంత సేపు చూపు తిప్పుకునేవారు కాదు. పదేళ్ల పాలన తర్వాత కూడా కేసిఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించినట్లైంది. బి ఆర్‌ఎస్ వేసిన అంచనాకు మించి ప్రజలు వచ్చారు. కోట్లాది మంది ప్రజలు అటు టివిలలో, ఇటు అరచేతిలో మెబైల్స్ ద్వారా కేసిఆర్ ప్రసంగం ఆధ్యాంతం వీక్షించారు. ఏడాదిన్నర తర్వాత ఇంతటి సభ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కేసిఆర్ ఒక్క పిలుపు చాలు..లక్షలాది మంది తరలివస్తారని మరోసారి రుజువైంది. ఇక మళ్లీ కేసిఆర్ యుగం మొదలైందా? అన్నట్లు జనం తండోపతండాలుగా వచ్చారు. పుట్టల నుంచి చీమలు చేరినట్లు చేరారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జన సందోహమే..వీరితోపాటు కేసిఆర్ సభకు హజరు కాలేక ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం మరో లక్షన్నర వరకు వుంటారని కూడా తెలుస్తోంది. సభా ప్రాంగణానికి చేరుకోలేక, ట్రాపిక్‌లో చిక్కుకొని వెనక్కి వెళ్లలేక, ముందుకు రాలేక, బస్సుల్లోనే అందరూ సెల్‌ఫోన్లలో కేసిఆర్ ప్రసంగం విన్నారు. చాలా కాలం తర్వాత కేసిఆర్‌ను చూసిన ఆనందంలో ప్రజలు కేరింతలు కొట్టారు. కేసిఆర్‌ను జయజయ ధ్వానాలతో ఆహ్వానించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఈసారి కేసిఆర్ ప్రసంగంలో ఉగ్రరూపం కనిపించలేదు. సమగ్ర రూపాన్ని సంతరించుకున్న ప్రసంగం కనిపించింది. ఇది కేసిఆర్‌కు భిన్నమైన కొత్త శైలి. పైగా ఎంతో శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేస్తూ కేసిఆర్ ప్రసంగం సాగింది. అదే సమయంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అంటూ కేసిఆర్ అనగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఇదే ఊపులో కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలను ఉటంకించిన కేసిఆర్, ఆ వైఫల్యాలను ప్రజల చేత ఒకటికి రెండు సార్లు చెప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంగట్టారు. ఇదిలా వుంటే ప్రజలను అన్నలారా అంటూ కేసిఆర్ సంబోధించడం కూడా మరో ప్రత్యేకత. ఉద్యమ సమయంలో మాత్రమే ఒకటి రెండు సార్లు అన్నట్లు గుర్తు. కాని తర్వాత తాను పెద్దకొడుకును అని అనేవారు కాని, సభకు వచ్చిన వారిని అన్నలని సంబోధించడం కూడా కొత్తగా వుంది. కేసిఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. తనదైన శైలికి భిన్నంగా కొత్త కేసిఆర్‌ను చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేక చతికిలపడుతున్న ఒక్కో పథకాన్ని ఏకరువు పెడుతూ, దెప్పి పొడిచారు. కొత్త రకం చురకలు అంటించారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చల్లటి వాతావరణంలో నిప్పులు చెరిగారు. పదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మార్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వల్ల తెలంగాణ తెర్లు అవుతుంటే తట్టుకోలేకపోతున్నానంటూ జీరగొంతుతో అన్నారు. ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రజలకు కేసిఆర్‌కు తెలంగాణ మీద వున్న మమకారాన్ని తెలుసుకున్నారు. ప్రజలు ఏమాత్రం దిగులు చెందొద్దని, వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీయే అని సభ సాక్షిగా ప్రకటించారు. దాంతో సభ మొత్తం కేసిఆర్ నినాదాలతో మారు మ్రోగిపోయింది. ఏడాదిన్నర కాలం మౌనంగా వున్నాను. కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చాం. ఇక ఊరుకునేది లేదు. ఆగేది లేదు. పాలకపక్షంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజా పక్షమే మన బిఆర్‌ఎస్ అని అన్నారు. ఇక నేను జనక్షేత్రంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పనిలో పనిగా పోలీసు శాఖను కూడా హెచ్చరించారు. పోలీసులు బిఆర్‌ఎస్ నాయకులపై చూపిస్తున్న అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. రాసి పెట్టుకోండి అని వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. సోషల్ మీడియా బిఆర్‌ఎస్ వారియర్స్ మీద కేసులు నమోదు చేయడాన్ని కేసిఆర్ ఖండిరచారు. వారికి బిఆర్‌ఎస్ అండగా వుంటుందని చెప్పారు.
పోచంపల్లి, పెద్ది, దాస్యంలకు కేసిఆర్ ప్రశంస: బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను తమ భుజస్కంధాల మీద వేసుకొని రేయింబవళ్లు కష్టపడి ఇంత పెద్ద సభ సక్సెస్‌కు కారకులైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్. దాస్యం వినయ్ బాస్కర్, మాజీ ఎమ్మెల్యే,ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పటి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిలను సభావేదిక సాక్షిగా కేసిఆర్ ప్రశంసించారు. వారు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలుతెలియజేశారు. ఈ ముగ్గురు పేర్లు కేసిఆర్ ప్రస్తావిస్తున్నప్పుడు జనం నుంచి పెద్దఎత్తున కేరింతలు, చప్పట్లు వినిపించాయి. ఎందుకంటే వరంగల్ సభ అంటే గతంలో జరిగిన మహా గర్జనకు సరిసమానంగా వుండాలి. లేకుంటే అంతకు మించి వుండాలి. ఏ మాత్రం తక్కువైనా మాట వస్తుంది. అందుకే ముగ్గురు నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి, ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ సభ ఏర్పాటు చూసుకున్నారు. కేసిఆర్ నుంచి ప్రసంసలు అందుకున్నారు.
ఖమ్మం ఈస్ ద మోస్ట్…వద్దిరాజు ఈస్ ద బెస్ట్: వరంగల్ రజత్సోతవ సభకు అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ప్రజల హజరైనట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలను మించి రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గత పదిహేను రోజులుగా పకడ్భంధీగా చేసిన ప్లాన్ ప్రకారం ప్రజలు తరలివచ్చారు. నిజానికి వద్దిరాజు చూపిన చొరవ మిగతా జిల్లాలు కూడా చూపించి వుంటే వరంగల్ సభ మరో రకంగా వుండేదన్న మాటలు కూడా వినిపించాయి. 1200 ఎకరాలు కూడా సరిపోయేది కాదు. ఎక్కడ చూసినా కనీసం ఓ 50 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యేది అని చర్చించుకున్నారు. ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో వద్దిరాజు రవిచంద్రను అదినేత కేసిఆర్ కూడా అభినందించారు. ఏ ఖమ్మం గుమ్మంలో ఇబ్బంది ఎదురైందో అదే ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు రజతోత్సవ సభకు తరలిరావడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖమ్మం దారిలోనే ఎక్కువ ఇబ్బందులకు గురిచేసిట్లుకూడా బిఆర్‌ఎస్ ఆరోపించింది. ఖమ్మం నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. వాటిని కూడా తట్టుకొని వద్దిరాజు సమన్వయంచేసుకుంటూ లక్షలాది మంది సభకు హజరయ్యేలా చూశారు. కేసిఆర్ నుంచి వద్దిరాజు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.