98% గ్రామ సభలు సజావుగా సాగుతున్నాయి
నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ముంపు బాధితులను ఆదుకుంటాం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
గ్రామసభలపై కొంతమంది బిఆర్ఎస్ బేవర్స్ బ్యాచ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, 98% గ్రామ సభలు సజావుగా సాగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర మండలంలోని నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ముంపు బాధితులను ఆదుకుంటామని, నారాయణపూర్ ప్రాజెక్టు దశాబ్దాల సమస్య అని దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారిన ప్రాజెక్టు అభివృద్ధిపై ఎవరు దృష్టి సారించలేదని ఎమ్మెల్యే అన్నారు. చాలామంది ఎమ్మెల్యేలుగా, స్వయంగా నారాయణపూర్ గ్రామం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఉన్నారు. అయినా నారాయణపూర్ ముంపు సమస్య పరిష్కారం కాలేదు.
చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ ప్రాజెక్టులను అన్నిటినీ పూర్తి చేసి, చివరి మడి వరకు సాగునీరు అందిస్తామన్నారు. గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేయడానికి ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహిస్తుందని, గత పదేండ్లలో అప్పటి ప్రభుత్వం ఒక్క గ్రామ సభను కూడా నిర్వహించలేదు, ప్రజలకు కనీసం ఒక రేషన్ కార్డు అందించలేదు. గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలకు విశేష స్పందన లభిస్తుంటే, గ్రామ సభలకు వస్తున్న స్పందనను చూసి ఓర్చుకోలేక కొందరు బేవార్స్ బిఆర్ఎస్ బ్యాచ్ అసత్యపు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ఎవ్వరూ అసత్యపు ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి తీరుతాం.
చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ప్రకటనను మంత్రి ఉత్తంకుమార్ చేశారని, నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా తీసుకుంటామని ప్రకటించి ఇక్కడి ప్రజలకు భరోసా కల్పించారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ సమావేశంలో గంగాధర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.