బీఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

https://epaper.netidhatri.com/

ప్రజల్లో బలంగా వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. మా పార్టీ ప్రజల గుండెల్లో వుంది. మళ్ళీ గెలుపు మాదే…గెలిచేది మేమే అంటున్న ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే…

`మేం చేసిన అభివృద్ధి కళ్లముందు వుంది.

`గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దాము.

`చెరువులు నింపాము.

`ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నాము.

`నీళ్లు కనిపిస్తున్నాయి.

`పంటలు కనిపిస్తున్నాయి.

`ఇరవై నాలుగు గంటల కరంటు చూస్తున్నాం.

`సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

`కాంగ్రెస్‌ కట్టుకథలు!

`కర్ణాటక లో అంతా డొల్ల.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ALSO READ: https://netidhatri.com/brs-wins-with-a-bumper-majority-says-government-chief-whip-dasyam-vinay-bhaskar/

ఎన్నికల్లో గెలిచేది బిఆర్‌ఎస్‌ పార్టీనే. మా పార్టీ హాట్రిక్‌ కొట్టుడు ఖాయం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మూడోసారి తెలంగాణను పాలించడం తధ్యం. తెలంగాణను కళ్లలో పెట్టుకొని కాపాడే నాయకుడు ఒక్క కేసిఆర్‌ మాత్రమే. బతుకు జీవుడా అని కాలం వెల్లబుచ్చుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి తల్లడిల్లిన మనసు కేసిఆర్‌ది. ఆకలికి కూడా లెక్కలేసుకొని బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్‌. జనం బొంబాయికి వెళ్లి కూలికో, బొగ్గుబాయిలో బతుకులు బలికో అన్నట్లు బతుకుల దారి కోసం వెలుతున్న వలసలను చూసి గుండె చెరువైపోయి తెగించి జై తెలంగాణ అన్నాడు. కంటి నుంచి కారే కన్నీరు కూడా గుండెల దాకా చేరకముందే ఆవిరైపోతున్న రైతన్న కష్టం చూసి చలించిపోయాడు. ఎడారిగా మారుతున్న తెలంగాణ మాగాణ మట్టివాసనలేకుండా,నీటి చుక్క జాడ లేకుండా నెర్రెలు బారిన పొలాలను చూసి కుమిలిపోయాడు. ఎద్దులేని ఎవుసం చేస్తున్న రైతులు కదిలించిన ఉద్వేగమే కేసిఆర్‌. నీటి కటకటలు తీరక, ఎండిన బావుల్లో చుక్క కనిపిస్తుందా? అని తొంగి చూస్తే బావుల్లో కన్నీళ్లు పడని కాలమది. పూడికల మీద పూడికలు తీయించినా, చుక్క కానరాని గడ్డు రోజులవి. గుక్కెడు మంచి నీటి కోసం నడి నెత్తిన బిందెలు ఎత్తుకొని ముళ్లు గుచ్చుకుంటున్నా, నొప్పిని భరిస్తూ కడివెడు నీళ్లు మోసుకొచ్చుకున్న తల్లులును చూసి తెలంగాణ విముక్తి కోసం నడుం బిగించాడు. ఉద్యమ కాలం నాడే చెరువుల మరమ్మత్తులు మొదలుపెట్టాడు. తెలంగాణ తెచ్చి, మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తెచ్చాడు. ప్రతి చెరువు నిండాలి. ప్రతి ఇంటికి మంచినీరందాలి. ఏ ఆడపడుచు బిందె పట్టుకొని బైటకు వెళ్లకుండా చేశాడు. మిషన్‌ భగీరధతో ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాడు. రైతన్నకు కన్నుల నిండా కనిపించే నీటి జాలు చూపించాడు. తెలంగాణ పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో తెలంగాణకు నీటి గోస తీర్చాడు. గడప గడపకు సంక్షేమాన్ని మోసుకెళ్తున్నాడు. తెగించి కొట్లాడిన చేతులతోనే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నాడు. సమసమాజ నిర్మాణం సాగిస్తున్నాడు. తెలంగాణలో కరంటు వెలుగులు నింపాడు. రెప్పపాటు కూడా విరామం లేని కరంటు సరఫరా చేస్తున్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాడు. రైతులకు రైతుబంధు అందిస్తున్నాడు. రైతు భీమా కూడా అందేలా చేస్తున్నాడు. దళితులకు దళిత బంధు అమలు చేస్తున్నాడు. గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించాడు. కదలించే హృదయం…చలించే మనసు రెండూ కేసిఆర్‌కు వున్నాయి. అందుకే సంక్షేమ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. తెలంగాణలను అన్ని రంగాల్లో మందుంచుతున్నాడు. కన్నీరు తుడిచే కరుణామయ మూర్తిగా కళ్యాణ లక్ష్మి అమలు చేస్తూ, ప్రతి ఇంటికి పెద్దకొడుకై ఆసరా అందిస్తున్నాడు. అండగా వుంటున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్న ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న అభిప్రాయాలు..ఎన్నికల విషయాలు ఆయన మాటల్లోనే…

 కాంగ్రెస్‌ చెప్పే కట్టు కథల్కో ఒక్కటైనా నిజముందా? 

ప్రస్తుతం మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలనే కాపీ కొడుతూ, వాటి కొనసాగింపును మ్యానిఫెస్టో గా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికే పేర్లు మార్చుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాంటి నాయకులను ప్రజలు ఎట్టిపరిస్ధితుల్లో నమ్మే ఆస్కారం లేదు. అవకాశం అసలే లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆయన తెలంగాణకోసం ఏనాడు ఉద్యమించింది లేదు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొట్లాడి, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధిస్తే , వచ్చిన తెలంగాణను అస్దిరపర్చాలని చూసిన తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి. ఇప్పటికీ ఆంద్రబాబు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూనే వున్నాడు. తెలంగాణ వచ్చిన కొద్ది రోజల్లోనే ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూసిన చంద్రబాబుకు సహకరించి అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్‌రెడ్డి. తాజాగా మా పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ఏం చెప్పాడో ప్రజలకు కూడా తెలిసింది. కాంగ్రెస్‌ గెలిస్తే నేను గెలిచినట్లే …అని చంద్రబాబు చెప్పారంటే తెలంగాణ మీద ఆంధ్రానాయకులు కుట్రలు ఎంత దుర్మార్గంగా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ అంటేనే స్కామ్‌ల పార్టీ. ప్రజలను వంచించేపార్టీ. అందులో ఇప్పుడు వున్న నాయకులు ఆరోపణలకు తగిన వాళ్లే వున్నారు. టిక్కెట్ల విషయంలో అమ్ముకాల జాతర సాగించిన రేవంత్‌రెడ్డిని నమ్మి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి వుండదు. అసలు ఆలులేదు చూలు లేదు సామెతలాగానే ఇటీవల జానారెడ్డి చేసిన ప్రకటన కూడా ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్‌ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటాడు. నేనే సిఎం అని చెప్పుకునేవాళ్లు కనీసం ఓపది మంది వుంటారు. ఇప్పుడు కర్నాటకలో ఏం జరుగుతోందో చూస్తూనే వున్నాం. ప్రజలకు మాయ మాటలు చెప్పిఅధికారంలోకి వచ్చారు. పథకాలు అమలు చేయాల్సిందిపోయి, అదికారం కోసం కొట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు. రైతులకు ఏడు గంటల కరంటు ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ కర్నాటకలో అధికారంలోకి వచ్చింది. కాని ఐదుగంటలే ఇస్తోంది. అది కూడా కోతలతో కూడిన నాణ్యతలేని కరంటు అన్నది అక్కడి రైతులే తెలంగాణకు వచ్చి చెబుతున్నారు. అంతే కాకుండా ఆ రాష్ట్ర మంత్రులే స్వయంగా తాము కర్నాకటలో ఐదు గంటల కరంటు మాత్రమే ఇస్తున్నామంటున్నారు. కర్నాకటలో వర్షాభావ పరిస్ధితుల మూలంగా కరంటు ఇవ్వలేకపోతున్నామన్నారు. మరి తెలంగాణలో కూడా వర్షాబావ పరిస్ధితులే వున్నాయి. అయినా రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు ఇస్తున్నాం. అంటే పాలకులకు చిత్తశుద్ది వుండాలి. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేయాలన్న సంకల్పం వుండాలి. కర్నాకటలో రైతులకు, ప్రజలకు నిరంతరం కరంటు ఇవ్వాలన్న చిత్తశుద్ది కాంగ్రెస్‌నేతలకు లేదు. ఎంత సేపు పదవుల కోసం కొట్లాట తప్ప, ప్రజలకు మేలు చేయాలన్న యావ లేదు. రేపు తెలంగాణలో ఒక వేళ ప్రజలు కాంగ్రెస్‌ను దయలిస్తే జరిగేది ఇదే..ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రైతులకు రైతుబంధు దండగ అన్నంత మాటలుమాట్లాడుతూనే వున్నాడు.

రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరంటు చాలంటున్నాడు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగావుండాలి. తెలంగాణ సాధించిన వారికి వున్న అంకిత భావం తెలంగాణ ద్రోహులకు వుండదు. వారికి రాజకీయాలు తప్ప, ప్రజా సంక్షేమం పట్టదు. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి దేశాన్ని, నిజాం రాజ్యం దేశంలో విలీనమైన తర్వాత నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ 50 సంవత్సరాల పాటు పాలించింది. కాని తెలంగాణకు ఏంచేసింది. తెలంగాణకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది. చెరువులను ద్వంసం చేసింది. సాగును విద్వంసం చేసింది. తెలంగాణ ప్రజలు వలసవెళ్తుంటే చేష్టలుడిగి చూసింది. ఎన్నికల నాడు మాత్రం ఓట్లకోసం ప్రజలను వాడుకున్నది. ఇలా అడుగడునా తెలంగాణను అన్యాయం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఇక తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ హైదరాబాద్‌ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది కూడా కాంగ్రెస్సే. నిజాం పాలనలో పెనం మీద వున్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిసి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌ పార్టీ. అలాంటి పార్టీ తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతికత అసలే లేదు. 2004 ఎన్నికల్లో తమ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఇస్తామన్నారు. అదికారంలోకి రాగానే మాట మార్చారు. రెండో ఎస్సార్సీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు. జలయజ్ఞం పేరుతో ఆంధ్రలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. అలా కూడా తెలంగాణను వంచించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తెలంగాణను ఉద్దరిస్తామని సన్నాయి నొక్కులు నొక్కితే ప్రజలు హర్షించరు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను నమ్మరు. మళ్లీ తెలంగాణలో వచ్చేది బిఆర్‌ఎస్సే…తెలంగాణ ప్రజల ఆత్మ బిఆర్‌ఎస్‌ పార్టీయే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *