`ఇన్ని ఓటములెదురైనా బిఆర్ఎస్లో మార్పు రావడం లేదు
`నేటిధాత్రి పదే పదే హెచ్చరిస్తూనే వస్తోంది

`అనేక సార్లు గుర్తు చేస్తూనే వస్తోంది
`స్థానిక నాయకత్వాన్ని గుర్తించాలని సూచనలిస్తూనే వుంది
`ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు

`60 లక్షల మంది కార్యకర్తలని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు
`జూబ్లీ ఓటమితోనైనా మేలుకుంటేనే మేలు
`లేకుంటే బీఆర్ఎస్ అధోగతి పాలు
`భవిష్యత్తులో గెలుపులు చూడలేరు
`విజయాల దరికి కూడా చేరుకోలేరు
`పార్లమెంటు ఎన్నికలలో సున్నా చుట్టినా మార్పు రాలేదు
`ప్రచారార్భాటం తప్ప ప్రజల్లో బీఆర్ఎస్ నేతలు లేరు
`ఇప్పటికైనా నేల మీదకు దిగిరాకపోతే పార్టీ కోలుకోదు
`గులాబీ రేకులు రాలిపోక తప్పదు
`కేసీఆర్ బైటకు రాకపోతే పార్టీ నిలబడలేదు
`పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు
`ఓడిన ప్రతిసారీ విశ్లేషించుకుంటామంటారు
`విశ్లేషించిన దాఖలాలు లేవు
`పదే పదే ఓటమి పాలుకాకుండా చూసుకుంటున్నది లేదు
`సిట్టింగ్ సీటును కూడా కాపాడుకోలేకపోయారు
`ఆరు నెలల నుంచి ప్రచారం చేస్తూనే వున్నారు
`మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు
`జనం మధ్యలోకి వెళ్లి ప్రచారం చేసిందేనాడు లేదు
`జిల్లాల నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు
`జూబ్లీ హిల్స్‌లో వున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు
`జూబ్లీ హిల్స్ నాయకులతో సంబంధాలు కొనసాగించింది లేదు
`బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం ఎంత కాలం?
`ఇలా అయితే ఓడిపోవడమే ఎల్లకాలం!
హైదరాబాద్, నేటిధాత్రి:
అతివిశ్వాసం ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందని, అధపాతాలమే దిక్కవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు బిఆర్ఎస్ను చూస్తే అర్ధమౌతోంది. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇదే నిజం. ప్రజలు చెబుతున్న నిజం. కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న వాస్తవం. ఏ పార్టీ అయినా నిజంలో వున్నప్పుడే విజయం సిద్దిస్తుంది. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా వుంటూ ఊహల్లో అగ్రనేతలుంటే ఫలితాలు జూబ్లీహిల్స్ లాగే వుంటాయి. బిఆర్ఎస్ నాయకులు అతి విశ్వాసమే జూబ్లీహిల్స్‌లో మరో సారి పార్టీ కొంప ముంచింది. బిఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాద్ మరణం నాటి నుంచి ప్రచారంలోనే వుంది. కాని ప్రజల్లో లేదు. ఇది ఇప్పటికైనా కేసిఆర్, కేటిఆర్‌లు తెలుసుకోవాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయి నాటి నుంచి వరుసు ఓటమిలను చవిచూస్తున్నా బిఆర్ఎస్ అధినాయత్వం మేలుకోవడం లేదు. నేల మీదకు రావడం లేదు. ఎంత సేపు ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయనుకుంటే బిఆర్ఎస్కు మనుగడ వుండదు. ఇది గతంలో అనేక సార్లు రుజువైంది. కళ్లముందు అనేక గుణపాఠాలున్నా, ఇంకా బిఆర్ఎస్ పాఠాలు నేర్చుకోకపోతే విజయాలు కష్టం. ఓటములే ఎదురవడం ఖాయం. సాదారణ ఎన్నికల ముందు బిఆర్ఎస్ శ్రేయోభిలాషులు ఎంతో మంది చెప్పారు. కొంత మంది బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్పారు. వాళ్లకంటే ముందు నేటిదాత్రి పదే పదే చెబుతూనే వచ్చింది. ఒక రకంగా హెచ్చరిస్తూనే వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తప్పించకపోతే పార్టీ కోరికోరి ఓటమి తెచ్చుకున్నట్లౌవుందని చెప్పడం జరిగింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలని వారి గురించి సమగ్రమైన వివరాలు కూడా నేటిదాత్రి అందించింది. కాని ఆ సూచనలు పూచికపుల్లగా భావించింది. ఓటమి కొని తెచ్చుకున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ అదే తప్పు చేసింది. సానుభూతిని నమ్ముకొని నిండా మునిగింది. అన్ని సార్లు సానుభూతి పనిచేయదు. దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమిని చూసైనా కేసిఆర్ మారలేదు. ఆనాడు రామలింగారెడ్డి మరణం వల్ల సానుభూతి కన్నా, వరుస ఓటములు ఎదుర్కొన్న రఘునందన్ రావు వైపు ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్‌లో ఏం తొందరొచ్చిందని అందరికంటే ముందుగానే సునీతను ప్రకటించారు. అంత కొంపలు మునిగిపోయేంత తొందర ఎందుకు పడ్డారు. జూబ్లీహిల్స్‌లో గోపీనాధ్ చేసిన అరాచాలు లేవా? గోపీనాద్ చేసిన అక్రమాలు లేవా? ప్రజలు కూడా అదును చూసి, బిఆర్ఎస్కు మరోసారి పాఠం నేర్పారు. జూబ్లీహిల్స్ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని పదే పదే రౌడీ రౌడీ అంటూ బిఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా వికటించింది. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే పరిగణలోకి తీసుకొని బిఆర్ఎస్ ప్రచారం చేస్తూ వెళ్లింది. కాని గ్రౌండ్లో ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయన్నది తెలుసుకోలేదు. గ్రౌండ్లో వుండే బిఆర్ఎస్ నాయకులను గుర్తించలేదు. వారి అభిప్రాయాలు తెలుసుకోలేదు. వారి సూచనలు తెలుసుకునే ప్రయత్నం అసలే చేయలేదు. ఎవరిని నమ్ముకున్నారు. ఆంద్రాకు చెందిన యూట్యూబ్ చానళ్లను నమ్ముకున్నారు. తెలంగాణకు చెంది, ఉద్యమ ప్రస్దానంలో వున్న వున్న బిఆర్ఎస్ అనుబంధ మీడియాను పక్కన పెట్టారు. క్షేత్ర స్దాయి పరిస్దితుల మీద పూర్తి పట్టున్న తెలంగాణ మీడియాను దూరం పెట్టుకున్నారు. పైపై ప్రచారాన్ని నమ్ముకొని నిండా మునిగారు. అటు మీడియా విషయంలోనూ తప్పటగులు వేసినట్లే, పోల్ మేనేజ్మెంటు అనుభవం వున్న నాయకులను రంగంలోకి దించలేదు. బిఆర్‌ఎస్‌లోవున్న ఎంతోమంది సీనియర్ నాయకులకు పక్కన పెట్టారు. అనేక ఎన్నికలు ఎదుర్కొని విజయం సాదించిన నాయకులకు దూరం పెట్టారు. పైగా జూబ్లీహిల్స్‌లో ప్రజలకు అందుబాటులోవుండి, ప్రజలకు నాడి తెలిసిన నాయకులకు బాద్యతలు అప్పగించలేదు. వారికి విలువే ఇవ్వలేదు. దాంతో బిఆర్ఎస్ ప్రజలకు దగ్గరకాలేకపోయింది. అయినా జూబ్లీ హిల్స్‌లో రైతు సమస్యలు ప్రస్తావిస్తే ఓట్లు రాలుతాయా? జూబ్లీహిల్స్‌లో ప్రజా సమస్యలను మీద స్పందిస్తే ఓట్లు రాలుతాయా? అన్నది గుర్తించలేకపోయారు. బాకీ కార్డు అని పట్టుకొని తిరిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నమ్ముకొని ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఇచ్చి, అమలు కాని హమీలను నమ్ముకున్నారు. ప్రజల్లో వాటిపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదన్నది గుర్తించలేదు. పైగా అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు వుంటాయి. ఈ మాత్రం బిఆర్ఎస్ గుర్తించలేదు. ఇంకా మూడేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో వుంటుంది. పైగా ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా నవీన్‌పై వుంటుందన్న ఆలోచన బిఆర్ఎస్ చేయలేదు. సునీత మీద వుండే సానుభూతి ఒక రకమైతే, నవీన్ మీద వున్న సానుభూతి మరో రకమైంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎంపికతోనే సగం గెలిచినట్లైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నవీన్ యాదవ్ బలమైన నాయకుడు. మాస్ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బస్తీలలో మంచి గుర్తింపు వున్న నాయకుడు. స్దానికుడు. ప్రజలకు సుపరిచితుడు. పైగా తెలంగాణకు చెందిన నాయకుడు. అన్నింటికీ మించి బిసి నాయకుడు. బిసీల వాదం పోలరైజ్ అవుతున్న సమయంలో అగ్ర కులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడమే బిఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. బిసి నాయకుడిని రౌడీ, రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. బస్తీలలో ప్రజలకు బిఆర్ఎస్ దగ్గర కాకపోవడం మూడో తప్పు. క్షేత్ర స్ధాయిలో వున్న నాయకులకు ప్రచార బాద్యతలు అప్పగించకపోవడం నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ల ఓట్లను నమ్ముకొని ముందుకెళ్లడం ఐదోతప్పు. ఆంద్రాకు చెందిన మీడియాను ఇంకా బిఆర్ఎస్ భుజాల మీద మోసుకుంటూ వెళ్లడం ఆరో తప్పు. సిఎం. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా, బిఆర్ఎస్ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోడం ఏడో తప్పు. అన్నింటికీ మించి కేసిఆర్ జూబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనమిదోతప్పు. ఎందుకంటే కేసిఆర్ నివాసం జూబ్లీహిల్స్లోనే వుంటుంది. కేసిఆర్ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం తొమ్మిదోతప్పు. కేసిఆర్ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం పదో తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా ప్రజల్లోకి రావాలి. ప్రచారం సాగించాలి. గెలవడం కోసం ఎంత పెద్ద నాయకుడైనా ఒక మెట్టు దిగాలి. ప్రదాన మంత్రి మోడీ రాష్ట్రాల ఎన్నికలవేళ ఎలా వుంటారో తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అసెంబ్లీ ఎన్నికకు ప్రచారం రాకపోవడం అధిపత్యాన్నే చూపిస్తుంది. జనాల మీద ప్రేమ కనిపించదు. అధికారంలోవున్నంత కాలం కేసిఆర్‌జనంలోకి రాలేదని, రావడం లేదనేదే ప్రధాన విమర్శ. ముఖ్యమంత్రిగా వున్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అభ్యర్ది ఎంపిక విషయంలోనూ తొందరపడలేదు. ఏడు రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం సాగించారు. సుమారు 15 కార్నర్ మీటింగులు పెట్టారు. కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. తన నాయకత్వాన్ని పదిలం చేసుకున్నారు. ఇదీ నాయకుడికి వుండాల్సిన ప్రధాన లక్షణం. అంతే కాని చట్ట సభకు ఎన్నికయ్యే ఎమ్మెల్యే ఎన్నికకంటే పెద్ద ఎన్నిక ఏముంటుంది? బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు దృష్టిలో అసెంబ్లీ ఎన్నిక చాలా చిన్నదిగా కనిపిస్తోందా? ఓడిపోయినా, ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లోనే వున్నారా? పార్లమెంటు ఎన్నికల ముందు రైతులు ఆగమైపోతున్నారని కేసిఆర్ కాలుకు బలపంకట్టుకొని తిరిగినా జనం ఎందుకు కనికరించలేదు. ఒక్కసీటులోనైనా ఎందుకు గెలిపించలేదన్నదానిపై ఇప్పటికీ అధ్యయనం చేయలేదు. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకులంతో చర్చింది లేదు. ఎందుకు ఓడిపోయామన్నదానిపై అంతర్మధనం లేదు. అలవి కాని హమీలిచ్చి కాంగ్రెస్ గెలిచిందని మాట్లాడుకుంటే సరిపోతుందా? రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అని కేసిఆర్ చెప్పిన మాటే ఆయనే మర్చిపోయారా? గెలవడానికి రాజకీయ పార్టీ అనేక మార్గాలను ఎంచుకుంటుంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే 2104లో ఇచ్చిన హమీలన్నీ బిఆర్ఎస్ అమలు చేసిందా? ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా? దళితులకు మూడెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులేత్తేయలేదా? కాంగ్రెస్ ఇప్పుడు అదే చేస్తోంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపడం కాదు. బిఆర్ఎస్లో వున్న లోపాలను సరిదిద్దుకోవాలి. అంతర్గత కలహాలు పక్కన పెట్టుకోవాలి. పార్టీ నాయకులను గ్రూపులుగా విడదీయం మానుకోవాలి. పార్టీని క్షేత్ర స్దాయిలో పునాదులు నిర్మాణం చేసుకోవాలి. జేజేలు కొట్టేవారే కాదు, ఓట్లు వేసేవారిని సంపాదించుకోవాలి.
