భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆశలను ప్రభుత్వం నిరాశపరుస్తోందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ, రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కట్టకం జనార్ధన్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
