బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగబోతున్నారు. హ్యాట్రిక్ కొట్టడానికి సుమారు 110 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. రోజుకు రెండు, మూడు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకు 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార షెడ్యూలును బీఆర్ఎస్ ప్రకటించింది. సభలకు భారీగా జన సమీకరణ జరిగేలా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ.. మరోవైపు హామీలు ఇస్తూ.. ఇంకో వైపు కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతూ గులాబీ దళపతి ప్రచారం జరగనుంది.
ఈ నెల 16న జనగామ, భువనగిరి, 17వ తేదీన సిరిసిల్ల, సిద్ధిపేట,18న జడ్చర్ల, మేడ్చల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలు, దసరా పండుగ ఉన్నందున ఈ నెల 25 వరకు కేసీఆర్ సభలకు విరామం ఇచ్చారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూలు, మునుగోడు, 27వ తేదీన పాలేరు, స్టేషన్ ఘన్పూర్లో బహిరంగ సభలు ఉంటాయని బీఆర్ఎస్ తెలిపింది. ఈ నెల 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31వ తేదీన హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు.
నవంబరు 1న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3వ తేదీన భైంసా, ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం సభల్లో సీఎం పాల్గొంటారు. నవంబరు 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8వ తేదీన సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో గులాబీ దళపతి సభల్లో ప్రసంగిస్తారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేస్తారు. తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.
ప్రతీ సభలోనూ సుమారు గంట పాటు కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రసంగాలపై బీఆర్ఎస్ అధినేత ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని వివరించి.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలపై హామీ ఇవ్వనున్నారు. జాతీయ, రాష్ట్ర అంశాలతో పాటు.. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రసంగాల్లో ప్రస్తావించనున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలతో గులాబీ దళపతి విరుచుపడేలా బహుముఖ వ్యూహంతో ప్రసంగాలు కొనసాగనున్నాయి.