-*”కాసాని”వెంట కదం తొక్కుతున్న గులాబీ శ్రేణులు*
– *ప్రచారంలో మార్క్ చూపుతున్న సబితమ్మ*
– *జ్ఞానేశ్వర్ గెలుపు దిశగా అడుగులు*
*నేటి ధాత్రి, చేవెళ్ల :*
లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చేవెళ్లలో మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించేలా బీఆర్‌ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయడంతో కార్యరంగంలో కదం తొక్కుతున్నారు.
అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు మంచి పేరున్న బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ చేవెళ్ల నుంచి బరిలోకి దింపడంతో ఎక్కడికెళ్లినా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి సెగ్మెంట్ల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇం టింటికీ వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించడంతోపాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదునెలలు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని.. ప్రజల్లోకి ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునివ్వడంతో వారు గ్రామగ్రామాన జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎంపీలుగా గెలిపిస్తే తమ స్వార్థం కోసం పార్టీలు మారిన రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిలను ఓడించేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు కసిగా పనిచేస్తున్నారు.
ప్రచారంలో బీఆర్‌ఎస్ దూకుడు..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ స్పీడ్ పెంచారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన అనంతరం వరుసగా రెండుసార్లు విజయదుందుబి మోగించిన బీఆర్‌ఎస్ మూడోసారి కూడా చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కాప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ప్రచారానికి మరో ఏడు రోజుల గడువే ఉండడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లా అంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని మం డలాల్లో నిర్వహిస్తున్న రోడ్‌షోలకు కాసాని హాజరై నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జనాలను కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసానితోపాటు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రచారంలో పాల్గొంటూ బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గమంతటా కాసానికి మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా ప్రచారం హోరెత్తుతున్నది. వికారాబాద్ సెగ్మెంట్లో రోజుకొక మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రచారం నిర్వహిస్తున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతున్నది.
తాండూరు సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మండలాల వారీగా కాసానికి మద్దతుగా ప్రచారం చేస్తూ ప్రజాశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలాల వారీగా రోడ్‌షోలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ కౌన్సిల ర్లు, నాయకుల ఆధ్వర్యంలో పరిగి మున్సిపాలిటీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం జరుగుతున్నది. ఏ గ్రామానికెళ్లినా బీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. బీసీలే కాకుండా అన్ని వర్గాలు కూడా కాసానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు జడ్పీచైర్మన్‌గా పనిచేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు పార్టీలకతీతంగా కాసానిని గెలిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
మూడోసారి గెలుపే లక్ష్యంగా..
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై పట్టుండ డంతోపాటు ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలకతీతంగా సొంత క్యాడర్‌ను కలిగి ఉన్న మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా ప్లాన్‌తో ముందుండి నడిపిస్తున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లోని నాయకులను సమన్వయం చేసుకుం టూ గెలుపే లక్ష్యంగా ఆమె ప్రచారంలో ముందుకెళ్తున్నారు.