
Newborn baby
నవజాత శిశువుకు……. తల్లిపాలే శ్రేష్ఠం:
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆగస్ట్ 1 వతేదినుండి 7 వ తేదివరకు దాదాపు 125 ప్రపంచదేశాలు తల్లిపాల వారోత్సవాల్ని జరుపుతున్నాయి. వరల్డ్ ఎలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏక్షన్ (ఔదీనా) సమన్వయకర్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాయి. నవజాత శిశువుకు పుట్టినప్పటి నుండి సంపూర్ణంగా తల్లి పాలను మాత్రమే తాగించే సంస్కృతిని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి దోహదంచేసే అర్ధవంతమైన కార్యక్రమాలను ఫలప్రదంగా జరుపుతున్నారు.
తల్లిపాలను తాగని శిశువులకు తల్లి పాలను తాగే శిశువులకంటే మొదటి సంవత్సరంలోపు చనిపోయే ప్రమాదం 21 శాతం ఎక్కువ ఉంటుందని, కనీసం మొదటి 3 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం తాగిన పిల్లలకు చనిపోయే ప్రమాదం 38 శాతం తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అనేక దేశాలలో, ముఖ్యంగా పేద దేశాలలో ఆమోదించలేని స్థాయిలో శిశు మరణాలు వుండడం వలన ఆ మరణాల్ని నివారించడానికి తీసుకోగలిగిన ప్రధాన
చర్యలలో ఒకటిగా బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వయసు వరకు కేవలం తల్లి పాలను మాత్రమే తాగించడాన్ని ప్రోత్సహించడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి, ముఖ్యంగా తల్లులు తమ బిడ్డకు తామిచ్చే అతి విలువైన బహుమతి ఆరోగ్యమేనని, తాము పాలివ్వడం ద్వారా ఆ బహుమతిని సులభంగా అందించవచ్చని తల్లులు తెలుసుకోవడానికి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరపడం ఒక విశిష్ట సాధనంగా వుంది.
తల్లి ఎప్పుడు పాలను పట్టడం ప్రారంభించాలి?
సహజ ప్రసవమైతే 2 గంటల లోపు, సిజేరియన్ అయితే 6 గంటల లోపు తల్లి బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టాలి. బిడ్డ రొమ్మును చీకుతూంటే తల్లి శరీరంలో కొన్ని నరాలు, గ్రంధులు ప్రతిస్పందించి పాల ఉత్పత్తి ప్రారంభమయేలా చేస్తాయి. అందుచేత తరచుగా రొమ్ముల్ని చీకించాలి. అలా చెయ్యడం వలన పాలు పడడమేకాక పాలు పడే సమయానికి బిడ్డకు పాలు తాగడం అలవాటవుతుంది.
తల్లిపాలలో ఉండే పోషకాలు:
1. నీరు:
తల్లి పాలలో ప్రధానంగా నీరు ఉంటుంది. ఇది శిశువు శరీరంలో నీరు అవసరమైనంత ఉండేలా చేస్తుంది.
2. మేక్రోన్యూట్రియంట్స్:
ప్రాచీన్స్: తల్లి పాలలో బిడ్డ సులభంగా జీర్ణం చేసుకోగల ప్రొటీన్స్ ‘వే ప్రోటీన్’, ‘కెసీన్’ ఉంటాయి.
పిండిపదార్ధాలు:
తల్లి పాలలో బిడ్డకు ప్రధాన శక్తిని ఇచ్చే ‘లేక్టోజ్ ఉంటుంది. లేక్టోజ్ జీర్ణవ్యవస్థలో ప్రయోజనకర బాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
క్రొవ్వులు:
మెదడు అభివృద్ధికి, శారీరక ఎదుగుదలకు అవసరమైన ఒమేగా ఫాటీ ఏసిడ్స్ 3, 6 తల్లి పాలలో ఉంటాయి.
మైక్రోన్యూట్రియంట్స్:
తల్లి పాలలో ఎ.ఇ.డి.కె.బి విటమిన్లు, ఐరన్, జింక్, కాల్షియం మొదలైన ఖనిజాలు ఉంటాయి. బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెంపుదలకు, ఎముకల దారుఢ్యానికి, సమగ్ర శారీరక అభివృద్ధికి మైక్రోన్యూట్రియంట్స్.