పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…

*ప్రతి ఒక్కరూ మంచి పుస్తక పఠనం వారి దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి.

*భారతీయ విద్యా భవన్ వారు ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన భేష్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం మంచి పుస్తక పఠనానికి కేటాయించి వారి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని యువతకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్ పేర్కొన్నారు.
నేటి శనివారం స్థానిక ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వారం రోజులకు పైగా కొనసాగుతున్న 17వ తిరుపతి పుస్తక ప్రదర్శనను కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ విద్యా భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన ప్రజల మన్నలు పొందుతు వారం రోజులుగా కొనసాగుతున్నదని, ఎన్నో అమూల్యమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరూ సందర్శించాలని, మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, మంచి పుస్తక పఠనం మంచి అలవాటుగా మన దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకుంటే జ్ఞానం పెంపొందుతుంది అని తెలిపారు. కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి పుస్తక ప్రదర్శనను తిలకించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు.
ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి 70 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని.ఈ ఆదివారం పుస్తక ప్రదర్శన ముగియనుందని ప్రతిరోజు సాయంత్రం సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశామని భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణ రాజు, అసోసియేట్ సెక్రటరీ దక్షిణామూర్తి కమిటీ సభ్యులు యుగంధర్ రాజు కలెక్టర్ కు వివరించారు.
పలువురు సాహిత్య పుస్తక అభిమానులు కలెక్టర్ తో మాట్లాడుతూ సదరు పుస్తక ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో చేపట్టిన పలు సాహిత్య, సంగీత కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!