
Sandeep Reddy
బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా…
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన అన్న సన్నీ డియోల్ మాదిరి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోయినా…
వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఆ మధ్య సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో విలన్ గా చేసి మెప్పించాడు.
అలానే ఇప్పుడు దక్షిణాది చిత్రాల మీద కూడా బాబీ డియోల్ ఆసక్తి చూపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) జూలై 24న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా క్రిష్ (Krish) తో పాటు ఆ సినిమా దర్శకత్వంలో భాగస్వామి అయిన జ్యోతికృష్ణ (Jyothi Krishna) కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియచేశారు.
వాటి గురించి ఆయన చెబుతూ, ‘నిజానికి బాబీ డియోల్ (Bobby Deol) పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించాం.
కానీ, ‘యానిమల్’ (Animal) లో బాబీ నటనను చూసిన తర్వాత ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నాను.
ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచాను. ‘యానిమల్’ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం.
పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది.
అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని జ్యోతికృష్ణ అన్నారు.
జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.
ప్రవీణ్ కె. ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు.
ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.