Congress Leaders Fire at BJP in Mancherial Meeting
కుల మతాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీకి తెలంగాణలో అవకాశం లేదు…
# టీపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం….
# ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి…
# కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
పార్టీ కోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తింపు రావడం లేదు
# మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వోడ్నాల శ్రీనివాస్ వ్యవహరించారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ లు హాజరయ్యారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంచిర్యాల జిల్లాలో ఇటీవల నూతనంగా నియమితులైన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తో పాటు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులకు మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బిఆర్ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని, అక్రమ కేసులు సైతం అనుభవించారని అన్నారు.

కార్యకర్తల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, టిడిపి పాలనలో చేయలేని అప్పులు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు దాటాయని అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ స్మగ్లింగ్ జరిగిందని బిఆర్ఎస్ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని దుయ్యబట్టారు. శ్రీరామచంద్రుడు బిజెపి పార్టీ జాగీరుల ప్రచారం చేసుకుంటున్నారని,మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ,రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తుందని అన్నారు. బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో తెలపాలని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న సొత్తులో కెసిఆర్ కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయని అన్నారు. కుల మతాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీకి తెలంగాణలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.

*ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం…
ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, కాంగ్రెస్ పార్టీ కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు సైతం అర్పించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సరే సోనియా గాంధీ చేపట్టలేదని అన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని తెలిపారు.
*కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి….
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పార్టీలో సీనియార్టీ ప్రాతిపదికన పదవులు ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయని అవి అన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లు చేసిన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిందని, కాంగ్రెస్ పార్టీ పై ,ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో భారీ అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని మండిపడ్డారు.
*పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు రావడం లేదు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు…
కొత్తగా వచ్చిన వారు వేదికల మీద కూర్చుంటే కాంగ్రెస్ బతకదని గుర్తించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించాలని, కొత్తగా చేరిన వారిని ముందు వరసలో నిలబెట్టి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించొద్దని అన్నారు. అధికారం ఉందని వచ్చిన వారు అధికార మార్పిడి జరిగితే ఎవరూ ఉండరని, ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పించి, గౌరవించాలని ఆయన కోరారు.కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశామని, గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశం ఇస్తేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఇది గుర్తించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
