భువనగిరిలో బీజేపీ జోరు!

– ప్రచారంలో దూసుకుపోతున్న బూర నర్సయ్య గౌడ్​


– 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలియ తిరిగిన డాక్టర్​ సాబ్​

– బీసీలకు బలమైన సెగ్మెంట్​ కావడంతో పెరుగుతున్న గ్రాఫ్​

– మోడీ చరిష్మాతో పాటు ‘బూర’ కు వ్యక్తిగతంగా మంచిపేరు

– సుపరిచితుడు, సౌమ్యుడు నర్సయ్యకే ఓటంటున్న జనం

– భారీ మెజారిటీ ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు

– కాంగ్రెస్​లో కోమటిరెడ్డి బ్రదర్స్​కు సహకరించని బీసీ క్యాడర్​?

– అభ్యర్థి కొత్త ముఖం కావడం కూడా హస్తం పార్టీకి అస్తవ్యస్తమే..

– సీఎం అనుచరుడు, అధికారం పేరుతో ‘చామల’ హల్​చల్​

– రసవత్తరంగా భువనగిరి పార్లమెంట్​ఎన్నికల పోరు

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:

భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గ పోరు హోరాహోరీగా ఉంది. బీజేపీ తరఫున బీసీ నేత, వివాదారహితుడు, సౌమ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​బూర నర్సయ్య గౌడ్, అధికార కాంగ్రెస్​పార్టీ తరఫున సీఎం సన్నిహితుడు, యువకుడు చామల కిరణ్​కుమార్​రెడ్డి, బీఆర్ఎస్​నుంచి మరో బీసీ వర్గానికి చెందిన సీనియర్​ నేత క్యామ మల్లేశ్​ఉండడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆర్థిక, అంగ బలం ఉన్న నేతలు పోటీ పడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలిసిన ప్రాంతంగా భువనగిరికి పేరుంది. ఈ లోక్​సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్​, ఆలేరు, భువనగిరి, జనగామ, తుంగతుర్తి ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి సుమారు 18 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగగా.. రెండు సార్లు కాంగ్రెస్​, ఒక సారి బీఆర్ఎస్​పార్టీలు గెలుపొందాయి. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఏదేమైనా భువనగిరి కోటపై కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ కంకణం కట్టుకుని ఉండగా.. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్​, బీఆర్ఎస్​సీరియస్​గా ప్రయత్నిస్తున్నాయి. తమ బలమెంతో నిరూపించుకుంటామని సీపీఎం కూడా భువనగిరిలో బరిలో నిలిచింది.

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు..
బూర నర్సయ్య డాక్టర్ ​గానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడిగా చెప్పొచ్చు. ఉద్యమంలో భాగంగా ఆయన ‘డాట్స్’ అనే పేరిట తెలంగాణ రాష్ట్ర వైద్యులు సంఘాన్ని స్థాపించారు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగర హారం, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి లాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆయన రెండుసార్లు అరెస్టు అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన లేదా చికిత్స అవసరమైన అనేక మందికి వృత్తిపరమైన సహాయం అందించారు. ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు.

బోణీ కొట్టాలని బీజేపీ ప్రయత్నం..
బీజేపీ మూలాలు బలంగా ఉన్న భువనగిరిలో ఈసారి ఏదేమైనా గెలిచి తీరాలని బీజేపీ ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. నర్సయ్యగౌడ్ కు మాజీ ఎంపీగా, వివాదరహితుడిగా, నియోజకవర్గంలో సుపరిచితుడిగా పేరుంది. అదే విధంగా ఆయన గతంలో ఈ నియోజకవర్గానికి చేసిన సేవలు కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్​ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఫండ్స్​తేవడంలో కూడా సక్సెస్​అయ్యారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కమిట్మెంట్ ​ఉన్న నేత..
గతంలో నర్సయ్యగౌడ్​ ఎంపీగా ఉన్న సమయంలో భువనగిరి పార్లమెంట్​ అభివృద్ధి కోసం ఒకానొక సందర్భంలో నాటి సీఎం కేసీఆర్​నే విభేదించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగానే కేసీఆర్​ నర్సయ్యగౌడ్​కు ప్రియారిటీ తగ్గించారనే వార్తలు కూడా వచ్చాయి. తన ప్రాంత అభివృద్ధిపై ఆయన ఎక్కడా రాజీ పడకుండా అవసరమైతే పార్టీ మారారు తప్పా.. కేసీఆర్ కు మోకరిల్లలేదు.

పార్టీతో పాటు వ్యక్తిగతంగా మంచిపేరు..
క్షేత్రస్థాయిలో ఓటర్లతో ఉన్న సంబంధాలు ఆయనకు అదనపు బలంగా చెప్పవచ్చు. ప్రధాని మోడీ చరిష్మా, నర్సయ్య గౌడ్ కు గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలు, లోక్​సభ నియోజకవర్గంలో 2లక్షలకు పైగా ఉన్న ఆయన సామాజిక వర్గం గౌడ్స్ ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉంది. దీంతో నర్సయ్య గౌడ్​ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.

కాంగ్రెస్​లో లుకలుకలు బూరకు మేలే..
ఎంపీ ఎన్నికల షెడ్యూల్​కు ముందు సిట్టింగ్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేతను భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నియమించి గెలిపిస్తానని శపథం చేశారు. దీంతో సదరు బీసీ నాయకుడు తన అనుచరులతో అంతా ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. కానీ సీఎం రేవంత్​రెడ్డి అనుయాయుడు అయిన చామల కిరణ్​కుమార్​రెడ్డిని క్యాండిడేట్​గా ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన తొలిదశలో కోమటిరెడ్డి బ్రదర్స్ అసహనానికి గురయ్యారన్న వార్తలు వచ్చాయి. తమ ఇలాఖాలో రేవంత్​రాజకీయం ఏందని పార్టీ అంతర్గతంగా చర్చ జరిగినట్లు కూడా తెలిసింది.

హోంమంత్రి పదవి ఎరతో దారికి..!
రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్​రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సఖ్యతతోనే ఉన్నా.. రాజగోపాల్​రెడ్డి మాత్రం గ్యాప్​మెయింటైన్​చేస్తూనే వచ్చారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి విషయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఆయన పూర్తిగా మారిపోయారు. హోంమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన రాజగోపాల్​కు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇవ్వడంతో.. పరిస్థితులు మారిపోయాయని కోమటిరెడ్డి అనుచరులే చెప్పడం గమనార్హం. దీంతో ఆయన భువనగిరిలో కిరణ్​కుమార్​రెడ్డి గెలుపు బాధ్యతలు తీసుకున్నాడని తెలుస్తోంది. శాసన సభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు తేడా ఉంటుంది. కేంద్రంలో బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న వాదనను బీజేపీ బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న టాక్​రోజు రోజుకు పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!